Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దెబ్బతిన్న పంటలను పరిశీలించిన..: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
అకాలవర్షాలకు వరి పంట తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయినిగూడెం పరిసర ప్రాంతాల్లో అకాలవర్షాలకు నష్టపోయిన వరిపంటను సీపీఐ(ఎం), రైతుసంఘం ఆధ్వర్యంలో ఆయన కలిసి ఓ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. సూర్యాపేట-ఖమ్మం 6వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కనున్న కేతినేని చెరువువాగును ఆక్రమించి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయడం మూలంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులో నీళ్ళు పట్టక పొంగిపొర్లి పక్కనున్న 50 ఎకరాల వరి పంట పూర్తిగా కొట్టుకుపోయిందన్నారు. పంటపొలాల్లోకి భారీగా ఇసుక చేరడంతో దాన్ని తొలగించేందుకు ఎకరాకు లక్ష రూపాయల చొప్పున ఖర్చవుతుందని తెలిపారు. కేతినేని చెరువు వాగుకు అడ్డుగా బలమైన గోడని నిర్మించడం మూలంగానే భవిష్యత్‌లో వరదలతో వల్ల రైతాంగానికి ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. రాయినిగూడెంలోని సెవెన్ ఆర్ హోటల్ ఎదురుగా వెలిసిన వెంచర్లలో అండర్ గ్రౌండ్ డ్రయినేజీలు, నాలా నిర్మాణం, సైడ్ కాలువలు, పైప్లైన్లు సక్రమంగా వేయకపోవడం మూలంగా వెంచర్ చుట్టుపక్కల నిర్మించిన గోడలు కూలి పక్కనున్న వందలాది ఎకరాల వరిపంటకు నష్టం వాటిల్లిందని ఆందోళన వెలిబుచ్చారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి వెంచర్ల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే కలెక్టర్, అధికారులు పరిశీలించి జరిగిన నష్టంపై అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి వరిపంట నష్టంపై వెంటనే అధికారులతో సమావేశం నిర్వహించి, నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆయన వెంట తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు జిల్లాపల్లి నర్సింహారావు, సీపీఐ(ఎం) వన్‌టౌన్ కార్యదర్శి ఎల్గూరి గోవింద్, త్రీ టౌన్ కార్యదర్శి మేకనబోయిన శేఖర్, రైతుసంఘం జిల్లా నాయకులు కొప్పుల రజిత, మేకనబోయిన సైదమ్మ, తదితరులు ఉన్నారు.