Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాలు భేష్ అని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) తెలిపింది. ఈ నిర్ణయాలను టీపీఏ ఎంతో కాలంగా కోరుతున్నదని పేర్కొంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల టీపీఏ అధ్యక్షులు నాగటి నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్ పద్మారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రిస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని సూచించారు. ఈ రెండు నిర్ణయాల అమలుకు అవసరమైన ఏర్పాట్లు త్వరగా చేపట్టాలని కోరారు.
ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం హర్షణీయం : టీఎస్టీసీఈఏ
రాష్ట్రంలోని ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం కొత్తచట్టం తేవడం హర్షణీయమని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ తెలిపారు. ప్రయివేటు విద్యాసంస్థల్లోని అధ్యాపకుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఆ బోర్డు ద్వారా జీతాలు చెల్లించేలా, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మన ఊరు-మనబడి మంచి నిర్ణయమని తెలిపారు. ఈ ప్రణాళికలో గ్రామాల్లోని యువతను, విద్యావంతులను, ఆ పాఠశాల పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు.
ఫీజుల నియంత్రణను స్వాగతించిన హెచ్ఎస్పీఏ
ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడాన్ని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్పీఏ) స్వాగతించింది. ఇందిరాపార్క్‌లో ధర్నా చేసినా, మానవహారాలు నిర్వహించినా, కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేసినా ఇలాంటి నిర్ణయం కోసమేనని హెచ్ఎస్పీఏ కార్యదర్శి వెంకట్ తెలిపారు. దశాబ్ధ కాలంగా తాము చేసిన పోరాటాలకు ఈ కమిటీతో కొంత ప్రతిఫలం దక్కిందని పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘానికి ఫీజుల నియంత్రణపై నివేదికను అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల పేద, మధ్యతరగతితోపాటు ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజు కట్టలేని విద్యార్థులకు మేలు కలుగుతుందని సీపీఎస్‌టీఈఏ అధ్యక్షులు దాముక కమలాకర్ తెలిపారు.