Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎదుగుదల లోపించిన ఇద్దరు అన్నదమ్ముళ్లకు
కాలేయ వ్యాధికి శస్త్రచికిత్స విజయవంతం
- తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తొలిసారి
- శస్త్రచికిత్సలో పాల్గొన్న ఏడుగురు వైద్యులు,
ఇతర వైద్యసిబ్బంది
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అరుదైన కాలేయ వ్యాధి సోకి ఎదుగుదల లోపంతో బాధపడుతున్న అన్నదమ్ముళ్లకు ఉస్మానియా వైద్యుల బృందం విజయవంతంగా శస్త్రచికిత్స చేసింది. ప్రయివేటు ఆస్పత్రులు ముందుకు రాకున్నా...ఉస్మానియాకు చెందిన ఏడుగురు వైద్యులు, ఇతర వైద్య సిబ్బందితో కూడిన బృందం ఈ ఆపరేషన్లో పాలుపంచుకున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి చికిత్స చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఖమ్మం జిల్లాకు చెందిన సిద్ధార్థ్(16), విజరు(14) జన్యుపరమైన లోపాలతో జన్మించారు. వారి తల్లిదండ్రులది మేనరికపు వివాహం కావడంతో ఆ పిల్లలిద్దరికీ అరుదైన కాలేయ సంబంధిత వ్యాధి సోకి ఎదుగుదల లోపించింది. పేద కుటుంబమైనా తమ పిల్లలను కాపాడుకోవాలని ఆ దంపతులు ఎక్కని ఆస్పత్రి గడపా లేదు. కాలేయ మార్పిడి లక్షలాది రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారమనీ, చికిత్స కూడా కష్టతరమైందనీ ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు తిప్పి పంపించేశాయి. దీంతో ఆ పిల్లల తల్లిదండ్రులు చివరి ప్రయత్నంగా ఉస్మానియా ఆస్పత్రి గడప తట్టారు. ఉస్మానియా ఆస్పత్రి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్.మధుసూదన్ నేతృత్వంలోని డాక్టర్లు పాండు నాయక్, డాక్టర్ రమేశ్ కుమార్, డాక్టర్ జ్యోతి, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ వేణు, డాక్టర్ వరుణ్ వారిని పరీక్షించి అరుదైన కాలేయ వ్యాధి (ప్రోగ్రెసివ్ ఫెమిలల్ ఇంట్రాహెపటిక్ కోలెస్టసిస్ (పీఎఫ్ఐసీ))గా గుర్తించారు. ఈ వ్యాధి సోకిన వారిలో కాలేయ పనితీరు ఆగిపోయి ఎదుగుదల లోపిస్తుంది. వయస్సు పెరిగినప్పటికీ ఈ వ్యాధిగ్రస్తులు తమ కన్నా చిన్న వయస్సు కలిగిన వారితో సమానంగా కనిపిస్తుంటారు. కాలేయంలోని బైల్ రసం బయటికి రాకుండా టాక్సిన్లు పేరుకుపోవడమే ఇందుకు కారణం. ఇలాంటి వారిని బతికించేందుకు కాలేయ మార్పిడి అనివార్యం. కాలేయం కొంత పని చేస్తున్నా సరే....మార్పిడి అవసరం లేకుండా శస్త్రచికిత్స చేసే అవకాశం ఇటీవల వైద్యరంగంలో వచ్చింది. అయితే, భారతదేశంలోనే ఇప్పటికీ ఇలాంటి శస్త్రచికిత్సలు అతి కొద్ది మందికి మాత్రమే చేశారు. ఈ వ్యాధికి శస్త్రచికిత్స చేసేందుకు డాక్టర్ సీహెచ్ మధుసూదన్ నేతృత్వంలో డాక్టర్లు ముందుకొచ్చి శస్త్రచికిత్స చేసి ఆ ఇద్దరు పిల్లల ప్రాణాలను నిలబెట్టారు. ఉస్మానియా ఆస్పత్రిలోనే ఏడాది బాబు, ఎనిమిదేండ్ల పాపకు కూడా కాలేయ మార్పిడి చేశారు.
సకాలంలో గుర్తిస్తే నయం చేయొచ్చు : డాక్టర్ మధుసూదన్
ఎదుగుదల లేని పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ మధుసూదన్ అన్నారు. అలాంటి పిల్లలకు సకాలంలో పరీక్షలు చేయించి గుర్తిస్తే చికిత్సతో నయం చేయొచ్చని చెప్పారు.
రక్తనాళాలకు ప్రత్యేక ఆస్పత్రి
రక్తనాళాల సమస్యతో బాధపడే వారికి అత్యాధునిక చికిత్సను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రముఖ పల్మనాలజిస్ట్, ఏసియన్ వాస్క్యులర్ హాస్పిటల్స్ ఎమ్డీ డాక్టర్ ఎ.నిరుపమ తెలిపారు. రక్తనాళాల్లో ఐదు విభాగాలుగా చికిత్స అందించేందుకు 150 బెడ్లతో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఆస్పత్రిని ప్రారంభించినట్టు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఆస్పత్రి వ్యవస్థాపక చైర్మెన్ డాక్టర్ జి.వి.ప్రవీణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.అనుపమ, సీఈఓ డాక్టర్ లిల్లి పాల్గొన్నారు.