Authorization
Sun April 13, 2025 03:25:13 am
- అప్రజాస్వామిక అరెస్టులను మానుకోవాలి
- ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి :
- టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయులను అడుగడుగునా అరెస్టు చేసి రోజంతా పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించడం అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఇలాంటి కవ్వింపు చర్యలను మానుకోవాలని హెచ్చరించింది. ఉపాధ్యాయుల ఆందోళనను అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యామంత్రి ఇంటికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఉపాధ్యాయులను, బీఆర్కే భవన్లో విద్యాశాఖ కార్యదర్శిని కలవడానికి వచ్చిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను, డీఎస్‌ఈకి వచ్చిన ఉపాధ్యాయులు, ప్రగతిభవన్ వద్దకు వెళ్లిన టీచర్లు ఇలా నగరంలో ఎక్కడ వారు కనిపించినా పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారని తెలిపారు. రాత్రి ఎనిమిది గంటల వరకూ వదిలిపెట్టకుండా వేధింపులు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఉపాధ్యాయులను గేట్లకు తాళాలు వేసి అక్కడే నిర్బంధించారని విమర్శించారు. ఏమిటీ? నిర్బంధమని ప్రశ్నించారు. ఇంతటి దుర్మార్గాన్ని ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ప్రభుత్వం ఇంతలా భయపడి ఉపాధ్యాయులను నిర్బంధించి వేధింపులకు గురిచేసే బదులు వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రెస్‌మీట్ నిర్వహిస్తే నిర్బంధమా? : టీపీటీఎఫ్
హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 13 జిల్లాల స్పౌజ్ బాధిత ఉపాధ్యాయులను పోలీసులు నిర్బంధించడాన్ని టీపీటీఎఫ్ తీవ్రంగా ఖండించింది. బీఆర్కే భవన్ వద్దకు జీఏడీ అధికారులతో సమావేశానికి వెళ్లిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సుమారు 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని టీపీటీఎఫ్ అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు తెలిపారు. 317 జీవో వల్ల బాధితులైన వారు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం పంతాలకు పోకుండా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల మల్టీ జోన్ కేటాయింపులను రద్దు చేయాలనీ, 13 జిల్లాల స్పౌజ్ బదిలీలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలనీ, పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని సూచించారు.
ఉపాధ్యాయుల అరెస్టులకు తపస్ ఖండన
ఉపాధ్యాయులను అరెస్టు చేయడాన్ని తపస్ రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ ఖండించారు. జీహెచ్‌ఎంల సమస్యలను పరిష్కరించడం కోసం వారితో చర్చించాలని డిమాండ్ చేశారు. స్పౌజ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల గళాన్ని నొక్కేయడానికి వారిని నిర్బంధించడాన్ని ఖండించారు. 317 జీవోను రద్దు చేయాలనీ, లేదంటే సవరించాలని కోరారు.
డీఎస్ఈ వద్ద ఎస్జీటీయూ మెరుపు ధర్నా
317 జీవో బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు (డీఎస్ఈ) కార్యాలయం ఎదుట ఎస్జీటీయూ ఆధ్వర్యంలో సోమవారం మెరుపు ధర్నా నిర్వహించారు. స్థానికతను దృష్టిలో ఉంచుకుని 317 జీవోను సవరించాలని ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షులు కరివేద మహిపాల్‌రెడ్డి, అరికెల వెంకటేశం డిమాండ్ చేశారు. కేటాయింపుల్లో లోపాలను సవరించాలని కోరారు. 13 జిల్లాల్లోనూ స్పౌజ్లకు అవకాశం కల్పించాలని సూచించారు.