Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెలవుల పొడిగింపును రద్దు చేయాలి :
ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో విద్యాసంస్థలకు ఈనెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగించడాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం అనాలోచిత చర్య అని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. జీవోనెంబర్ నాలుగును రద్దు చేసి విద్యాసంస్థలను భౌతికంగా నడపాలని కోరారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే ఒక మండలంలో, కొన్ని విద్యాసంస్థలనో మూసి వేయొచ్చని సూచించారు. కరోనా నిబంధనలను పది రోజులకోసారి పొడిగిస్తున్న ప్రభుత్వం విద్యాసంస్థలకు మాత్రం రెండువారాలపాటు సెలవులు ప్రకటించడం సరైంది కాదని తెలిపారు. ఇప్పటికే ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యా ప్రమాణాల్లో బాగా వెనుకబడిపోయారని వివరించారు. కరోనా కాస్త పెరిగిందంటే వెంటనే విద్యాసంస్థలను మూసేయడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. ఈ మధ్యకాలంలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు చదువుల్లో ఎంత వెనుకబడిపోయారో స్పష్టమైందని గుర్తు చేశారు. విద్యాసంస్థలను బాగుచేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వం, మూసేయడంలో మాత్రం ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నదని తెలిపారు. ఇలాంటి అనాలోచిత చర్యలు మానుకోవాలని హితవు పలికారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి :
సీఎంకు నర్సిరెడ్డి లేఖ
రాష్ట్రపతి ఉత్వర్వులు-2018 ప్రకారం కొందరు ఉపాధ్యాయులను స్థానికేతర జిల్లాలకు కేటాయించారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తెలిపారు. భార్యాభర్తలైన ఉపాధ్యాయులు వేర్వేరు జిల్లాలకు కేటాయించబడ్డారని వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆయన సోమవారం లేఖ రాశారు. ఈనెల ఒకటిన సైతం లేఖ రాశానని గుర్తు చేశారు. భార్యాభర్తల సమస్య కొన్ని జిల్లాల్లో పరిష్కరించారని తెలిపారు. ఇంకా 13 జిల్లాల సమస్య మిగిలిఉందని పేర్కొన్నారు. స్థానికత ఆధారంగా సొంత జిల్లాకు కేటాయించే అంశం అలాగే మిగిలిపోయిందని వివరించారు. ఈ రెండు సమస్యలపైనా ఎలాంటి ఆదేశాలు రాకపోవడం వల్ల పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారానికి తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.