Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కేంద్రాన్ని కోరిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన పీఎం గతి శక్తి సౌత్‌జోన్ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్, పవర్, బొగ్గు తదితర రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను మంత్రి కేటీఆర్ వివరించారు. అన్నిరంగాల్లో ముందుకెళ్తున్నా కేంద్రం నుంచి తెలంగాణకు తగిన సహకారం అందడం లేదంటూ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంచి పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో రక్షణ రంగానికి సంబంధించిన పటిష్టమైన వ్యవస్థ ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వ్యవస్థ లేని బుందేల్‌ఖండ్‌కు డిఫెన్స్ కారిడార్‌ను ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి డిఫెన్స్ కారిడార్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాజిస్టిక్ మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలను మంజూరు చేస్తే, రాష్ట్రం డ్రైపోర్ట్‌లు, ఇంటిగ్రేటెడ్, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. గూడ్స్ వేగంగా వెళ్లేందుకు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. నార్త్ సౌత్ ఫ్రైట్ కారిడార్ హైదరాబాద్ ప్రాంతాన్ని తాకకుండా తెలంగాణ మీదుగా వెళుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. లాజిస్టిక్ సౌకర్యాలు, పారిశ్రామిక క్లస్టర్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయనీ, ఫ్రైట్ కారిడార్ హైదరాబాద్ గుండా వెళితే మరింత ఉపయుక్తంగా ఉంటుందని సూచించారు.