Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెలుతురు తింటది ఆకు..
ఆకును తింటది మేక..
మేకను తింటది పులి... ఇద కదరా ఆకలి..! అంటూ ఓ వ్యక్తి ఆయుధం పడితే ఈలలు.. కేకలు..
'ఒక్కొకరిని కాదు షేర్ఖాన్.. వందమందిని ఒకేసారి రమ్మను' అని మరోవ్యక్తి డైలాగ్ కొడితే... దర్వులు, డాన్సులు. ఇలా... కాల్పనిక కథా చిత్రాల్లోని హీరోల మాటల్లో మైమరచేలా అలవాటు పడ్డ మనకు..
ఎదురుగా నిలిచిన చావు, గుండెపై తుపాకీ మోత అవుతున్నా.... ఎదిరించేటోన్నల్లా సంపి గుట్టలు, పుట్టల్లో మాయం చేస్తున్నా.. ఒక్కొక్కడు కాదు... ఇంటికొక్కడు కాదు...కుటుంబాలకు కుటుంబాలే అన్యాయంపై కలబడి, నిలబడ్డ నిజమైన వీరగాథల్ని వింటే... మన ఎద బరువెక్కదా? రుధిరమైన ఆ నేల కథల్ని కంటే... మన మది పులకించదా? అలాంటి నిజమైన హీరోలకు పురుడుపోసిన ఊరే... జనగామా జిల్లాలోని దేవరుప్పల మండలంలో ఉన్న ధర్మాపురం.
అన్ని పల్లెల లెక్కనే దొరలు, దేశ్ముఖ్ల దోపిడీ కుట్రలు ఇక్కడా సాధారణమే. అయినా... ఇక్కడి లంబాడీ గిరిజన బిడ్డలు చేసిన పోరాటం, ఎదురు దెబ్బలెన్నున్నా... వారు చూపిన సాహసం అసాధారణమైనది. కడివెండికి కొద్ది దూరంలోనే ఉండే ఈ పల్లె పడమటి తండా ప్రజలు తమ సహజమైన భూమి హక్కు కోసం... స్థానిక రాఘవరావు దొర, వాళ్ళ నాయకుడు విస్నూరు దొరతో సై అంటే సై అని నిలిచారు. వారి పీడన భరించలేక భుక్తికోసం భూములు ఆక్రమించుకున్నారు. గుండాలను తరిమికొట్టి, వారి నాగండ్లను కాలబెట్టి, ఐక్యతతో పోలీసులను ఎనక్కి కొట్టారు. న్యాయస్థానాల్లో నిలువలేక మళ్లీ దొరలకే కోల్పోయిన ఆ భూములపై దొడ్డి కొమరయ్య అమరత్వం తర్వాత రగిలిన చైతన్యంతో మరోసారి ఎర్రజెండాలు నాటారు. జన బలానికి జడిసిన పోలీసులు సాయంవేళ... పొద్దుతో పాటే... ఊరి పొలిమేరలు దాటి వెళ్లిపోయారు.
వ్యవసాయంతో పాటు, చెట్టు పుట్టనే నమ్ముకున్న ఈ గడ్డపై... పోరుకు నేతృత్వం వహించిన అనేక కుటుంబాల్లో ముందువరసలో ఉన్నది జాబోతు హాము, మంగమ్మ కుటుంబం. వీరి కడుపున పుట్టిన జోద్యా, సోమ్లా, సాంక్రూ, ఠానూ, దర్గ్యా, కిషన్ ఆరుగురూ... వీరులుగానే గుర్తింపు పొందారు. ప్రజల తరపున భూస్వామ్య దోపిడీపై తమ రోషం చూపించారు. ఠాను, జోద్యా, దర్గ్యా... సాయుధ దళంలో పనిచేయగా... మిగతా వారు జనంలోనే ఉండి కొట్లాడారు. కుటుంబం నుంచి పోరాటాల్లో ఒక్కరొక్కరు ఒరుగుతున్నా.. ఒక్కరూ వెనక్కి తగ్గకుండా సంఘ సైన్యంగా నిలిచారు.
జనం తిరుగుబాటుతో ధర్మాపురంలో పరువుపోయిందని భావించిన దేశ్ముఖ్... అక్కడ ఎలాగైనా పట్టు సాధించాలని ప్రత్యేక పోలీసు క్యాంపు పెట్టి బారీగా బలగాలను దింపాడు. ఈ చర్యతో ప్రజలపై నిర్భంధం మరింత పెరింగింది. దాడులూ పదే పదే జరపడంతో పాటు ఆడవారిపైనా... అమానుష చర్యలకు పాల్పడ్డారు. 'సంఘం' అండతో జనం ఎదురు తిరిగారు. సంఘం నీడలో ఒక్కటైన ఆ ఊరి చైతన్యం ముందు నిలబడటం నిప్పుల కుంపటిపై నిలవడ్డట్టు భావించిన దొరలు.. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉన్నారు. మంచికి గోతులు తీస్తూనే ఉన్నారు.
తమ ప్రతాపం చూపించాలని రగులుత్ను దొరమూక ఓ కాళరాత్రి ధర్మపురంపైకి నిజాం రజాకార్లను ఉసిగొలిపింది. రెండు లారీల మందిని దింపింది. దేవురుప్పులలో లారీ దిగిన నిజాం, రజాకార్లు... కాలినడకన ధర్మాపురం చేరి... పడమటి తండాలోని ప్రతి ఇంటిపై విరుచుక పడ్డారు. జనాన్ని ఒక్క చోటికి చేర్చి ఉద్యమ కారుల జాడ తెలపాలంటూ హింసించారు. కళ్లల్లో కారం చల్లారు. ఆ బాధలు చూడలేక తనే దళ సభ్యుడిని అంటూ ముందుకొచ్చాడు సాంక్రూ. అతనితో పాటు మరో నలుగురు అనుమానితుల్ని పట్టుకుని, మోపుల కొద్ది చింత బరిగెలతో కొట్టి, గాయాలకు కారంపూసి రాక్షసత్వనికి ప్రతీకగా నిలిచిన ఈ రజాకార్ రాక్షసగుంపు... వారి చేతే చితులు పేర్పించారు. ''ఇప్పటికైనా సంఘం నేతల జాడ చెప్పండి. లేదా మీ చితిని మీరే అంటించుకోండి'' అని బెదిరించారు. ఈ ఘటనలో ప్రత్యక్ష్యంగా పాల్గొన్న బాబుదొర కండ్లెర్ర చేశాడు. కానీ ఏ బెదురు లేకుండా ఎర్రజెండాకు జై అంటూ ఆ వీరులు ఆత్మార్పణం చేశారు. వారు సమీప గుట్టల్లో చంపేసి తీసుకొచ్చిన మరో వీరుడి శవాన్ని కూడా మంటల్లోనే పడేశారు. ధర్మపురం కోసం, ధర్మం కోసం మంటల్లో మాడి త్యాగానికి మారు పేరుగా నిలిచిన ఆ వీరులు... ఆ తండా నుదుటిపై సింధూరమై మెరిసిన ధీరులు.
ఈ పోరాటాలన్నిటికీ సజీవ సాక్ష్యంగా నిలిచిన యోధుడు 106 ఏండ్ల దర్గ్యానాయక్. వీర తెలంగాణ పోరాటం పేరువింటే .. నేటికీ తొలి పొద్దులా వెలిగే ఆయన ముఖం... జ్ఞాపకాల్ని నెమరువేసుకునేటప్పుడు వయసును అధిగమించి గర్జిస్తది. మంటల్లోనే ఒక అన్నను కోల్పోయిన దర్గ్యా, మరో అన్నను నెహ్రూ సైన్యం 1995లో బండికట్టి ఈడ్చి చంపేసింది. కడివెండి, పాలకుర్తి ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న దర్గ్యా, మహా క్రూరుడు విసునూరు దేశ్ముఖ్ కుమారుడు బాబు దొరను హతమార్చిన దళంలోనూ ఉన్నాడు. నెహ్రూ సైన్యం ఉరిశిక్ష విధించిన వీరుల్లో ఒకడైన దర్గ్యా!... అంతర్జాతీయ సమాజం ఆందోళనల ఫలితంగా 1957 నవంబర్1న విడుదలయ్యాడు. తర్వాత కూడా ఎర్రజెండా బిడ్డగా, సర్పంచిగా, 18ఏండ్ల పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేశాడు.
ధర్మం కోసం, న్యాయం కోసం...
నీతి కోసం... నవరీతి కోసం
సాగిన ధర్మాపురం పోరాటం ఓ కొత్త వెలుగు...
''ఏనాటికైనా, కష్టజీవుల కన్నీళ్ళు తీర్చేది పోరుదండే
ప్రజలందరి సమత కోరేది ఎర్రజెండే'' అని నేటికీ నినదిస్తోంది ఆ పోరు పల్లె.