Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెలవులు పొడిగింపుపై తల్లిదండ్రులు
- జీతాల వెతలు తప్పవంటున్న ప్రయివేటు స్కూల్స్ టీచర్లు
- ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు
నవ తెలంగాణ -మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఒమిక్రాన్ వెరియంట్ వైరస్ వ్యాప్తితో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను ఈనెల 30వ తేదీ వరకు వాయిదా వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భిన్న స్పందన వ్యక్తమైంది. ఉన్నపళంగా హాలి డేస్‌ను 15రోజులు పెంచడం ప్రయివేటు స్కూల్స్ ఆన్లైన్ క్లాస్‌లు ప్రారంభిం చడం పట్ల మెజారిటీ విద్యార్థుల తల్లిదండ్రులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదిలోని బోధనకు ఆన్లైన్ చదువులకు ఎంతో తేడా ఉంటుందని.. గతేడాది అనుభవం ఇందుకు గుణపాఠమని చెబుతున్నారు. గతేడాది ఆన్లైన్ చదువులతోనే గడిచిపోయినా.. తమ పిల్లల్లో ఏమాత్రం వృద్ధి కనిపించడం లేదని ఆవేదన చెందుతున్నారు. వేలకు వేలు ఫీజులు చెల్లించి.. ఆన్ లైన్ క్లాసులకు వందల కొద్దీ ఫోన్ రీచార్జ్‌లు చేసినా..పిల్లలకు అర్థమయ్యేది అరకొరేనని మండిపడుతున్నారు. ఒమిక్రాన్ పేరుతో ప్రభుత్వం స్కూల్స్ సెలవులను పెంచడం కంటే ముందే.. జనసంచారం ఎక్కువగా ఉండే.. మద్యం షాపులు, బార్లు, సినిమా థియేటర్లను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మొత్తం కలిపి 3990 ఉన్నాయి. వీటిలో 5,76,071 మంది విద్యార్థులు చదువుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 1702 పాఠశాలలుండగా.. 2,50,360 మంది విద్యార్థులు, సిద్దిపేట జిల్లాలో 1267 పాఠశాలలుండగా.. వాటిలో 1,63,373 మంది విద్యార్థులు, మెదక్ జిల్లాలోని 1023 పాఠశాలల్లో 81349 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం సెలవులను ప్రకటించిన గంటల్లోనే.. ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు టీచర్లకు సూచనలు చేసేశాయి. ప్రభుత్వ ఉత్తర్వులు శనివారం వెలువడగా.. సోమవారం నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించాలని ఆదేశాలిచ్చాయి. దీంతో విద్యార్థులకు ఆయా క్లాస్ టీచర్లు జూమ్ మీటింగ్ లు పెట్టేశారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పిల్లలంతా స్మార్ట్ ఫోన్లతో కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో వైఫై కనెక్షన్ లేని చోట ఇంటర్నెస్ సమస్య
ఎక్కువగా కనిపిస్తోందని పలువురు విద్యార్థులు తల్లిదం డ్రులు పేర్కొన్నారు. మొబైల్డేటా కోసం వందల రూపా యలు ఖర్చు చేసినా జూమ్ మీటింగ్‌కు కనెక్ట్ కాలేదని తెలి పారు. స్కూల్లో అయితే ఉపాధ్యాయులు చెప్పే పాఠాల్లో ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చు.. టీచర్ ఇచ్చే నోట్లు రాసుకునేందుకు కూడా టైం దొరుకుతుంది. ఈ ఆన్ లైన్ క్లాసుల్లో అసలు నెట్ కనెక్ట్ అయ్యేదే కష్టం.. కనెక్ట్ అయినా.. టీచర్ చెబుతున్నది సరిగ్గా అర్థమౌతుందా అంటే అదీ లేదు. పిల్లల అవస్థలు చూసి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ కరోనా కాలం ఇంకెన్ని రోజులు.. మా పిల్లలకు ఈ అవస్థలు ఎన్ని రోజులు అని మదనపడుతున్నారు.
స్కూల్స్ తెరవాలి : శనిగరం రమేష్, విద్యార్థి తండ్రి,మద్దూరు, సిద్దిపేట జిల్లా
కరోనా, ఒమీక్రాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను ఈనెల 30 వరకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. మొదటగా వైన్ షాపులు, సినిమా హాల్స్, పబ్బులు, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆంకక్షలు విధించాలి. పాఠశాలలను బంద్ చేసినంతమాత్రానా కరోనా కట్టడి అవుతుందా..? ప్రభుత్వం వెంటనే స్కూళ్లను ప్రారంభించాలి.
సెలవులు పొడిగించడం సరైంది కాదు : కొడిపల్లి ప్రశాంత్, టీఎస్ యుటిఎఫ్ చేర్యాల మండల ప్రధాన కార్యదర్శి
విద్యాసంస్థలను మూసివేయడం సరైంది కాదు. గత సంవత్సరం ఆన్లైన్ తరగతుల ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోగా తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడిన సందర్భాన్ని గత అనుభవాలు తెలియజేశాయి. ఈ సంవత్సరం పాఠశాలలు ప్రారంభమైన నుండి 50 శాతం సిలబస్ పూర్తి కాలేదు. పాఠశాలలో కరోనా నిబంధనలు పాటించడానికి అవసరమయిన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించకుండా సెలవులు పొడిగించడం కరెక్ట్ కాదు.
ఫీజులం తప్పదేమో..? : మల్లేశం, మల్కాపూర్, హత్నూర మండలం
గత సంవత్సర కరోనా కారణంగా పిల్లలు ఇబ్బందులుపడ్డారు. ఆన్లైన్ క్లాసులు పేరుతో ప్రయివేటు విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేస్తుండ టం తల్లిదండ్రులకు పెనుభారంగా మారింది. ఈ సంవత్సరం కూడా అలానే చేస్తే తల్లిదండ్రులకు తిప్పలు తప్పవు.
పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు : అశోక్, కిష్టపూర్ కల్హేర్ మండలం,
సినిమా హాలల్లో, బార్షాప్లలో జనాలు ఉన్నా, రాజకీయ నాయకుల మీటింగులలో , రైతు బందు ర్యాలీలలో లేని కరోనా పాఠశాలల్లోనే ఉందా..? పిల్లల భవిష్యత్ తో ఆటలొద్దు. ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్రయివేట్ స్కూళ్లు ఫీజులు వసూలు చేయకమానవు. పిల్లలకు ఒత్తిడి తప్పదు.
ఇలా అయితే కరోనా ఆగుతుందా? : నజీర్, ప్రయివేట్ టీచర్, చేగుంట
కరోనా మొదటి దశ, రెండవ దశలలో పెట్టిన ఆంక్షలతో విద్యార్థులు అమూల్యమైన సమయా న్ని కోల్పోయారు. పదవ తరగతి విద్యార్థులను పాస్ చేయడంతో అంద రినీ ఒకేగాటికి కట్టినట్టయింది. కరోనా కారణంగా సగం జీతాలకే పనిచేస్తున్న మాలాంటి వారికి మరోసారి ఆంక్షలం టే భయమేస్తున్నది.
పిల్లలు ఇప్పుడే నేర్చుకుంటున్నారు..
గతేడాది కరోనా కాలంలో మరిచిపోయిన పాఠాలను పిల్లలు పాఠశాలకు వెళ్లి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. క్రమశిక్షణతో హౌంవర్క్ చేసుకుంటున్నారు. మళ్లీ ఆన్లైన్ లంటే నేర్చుకున్నది మొత్తం మర్చిపోతారు. స్మార్ట్ ఫోన్లకు నెట్ కోసం వెచ్చించే రీచార్జ్ లు కూడా పెంచేశారు. మూడు నెలలకు రూ.700 ప్లాన్ వేసుకున్నా నెట్ రావట్లేదు. ఏం చేయాలి.
- భాగ్య, గృహిణి, టేక్మాల్ మెదక్ జిల్లా