Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలి
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఆదేశించిన మేరకు ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను బాగా పెంచాలనీ, రోజుకు లక్ష చొప్పున పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజన్ పరీక్షలకు సంబంధించి వేర్వేరుగా నివేదిక అందజేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్ కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు సోమవారం జారీచేసింది. ఎక్కడపడితే అక్కడ ప్రజలు గుడిగూడకుండా చూడాలనీ, భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలనీ, విధిగా మాస్క్లు ధరించేలా చేయాలని ఆదేశించింది. తప్పనిసరిగా ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
కరోనా నియంత్రణకు ఉత్తర్వులు కోరుతూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు సోమవారం మరోసారి విచారించింది. ప్రతిరోజూ తప్పసరిగా లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలంటూ గతంలో ధర్మాసనం ఆదేశించిందనీ, అయితే రోజుకు 50 వేలకు మించి పరీక్షలు చేయడం లేదనీ, ఒక్కోసారి మాత్రమే లక్ష టెస్ట్లు చేస్తున్నారని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్, న్యాయవాది చిక్కుడు ప్రభాకర్లు వాదించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని హైకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలు అమలు కావడం లేదన్నారు. కరోనా కేసుల ఆధారంగా కంటైన్మెంట్, మైక్రోకంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలూ అంతంతమాత్రంగానే ఉన్నాయని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఆరోపించారు. సరైన నియంత్రణ చర్యలు లేక అనేక మంది న్యాయవాదులు, న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది కరోనాబారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి నేతత్వంలో మంత్రి మండలి సమావేశమై చర్చించనుందని ఎజి బీఎస్ ప్రసాద్ చెప్పారు. రోజుకు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజన్ పరీక్షలను కలిపి లక్ష వరకు చేయాలని గతంలో ధర్మాసనం ఆదేశించిందని గుర్తు చేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, కరోనా కేసులు పెరుగుతున్నందున హైకోర్టు, రాష్ట్రంలోని ఇతర కోర్టుల్లో వచ్చేనెల నాలుగో తేదీ వరకు ఆన్లైన్ విధానంలో కేసుల విచారణ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. కరోనా నియంత్రణ చర్యలపై నివేదిక అందజేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది.