Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీజేఎంఏ అధ్యక్షుడు గౌరి సతీశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా యనే కారణంతో విద్యాసంస్థలకు ఈనెల 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించడం సరైంది కాదని తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) అధ్యక్షుడు గౌరి సతీశ్ తెలిపారు. పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువున్నా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించలేదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ప్రభు త్వం ఆలోచించాలనీ, విద్యాసంస్థలను వెంటనే తెరవాలని కోరారు. అవసరమైతే షిఫ్ట్ పద్ధతిలో విద్యాసంస్థలను నడపాలని సూచించారు. ఇంటర్ పరీక్షలు, జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థుల జీవితాలు ఎంతో ముఖ్యమని తెలిపారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేయొద్దని కోరారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఇంటర్ బోర్డుపైనా, పరీక్షలపైనా విద్యార్థులు నమ్మకం కోల్పోయే ప్రమాదముందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యాసంస్థలను తెరిచే అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. కోవిడ్ నిబంధలను అమలు చేసి తరగతుల నిర్వహణకు అనుమతించాలని తెలిపారు. క్లబ్బులు, ఫంక్షన్‌హాళ్లు, షాపింగ్ మాల్స్, వైన్‌షాపులు, బార్లకు నిబంధనలు విద్యాసంస్థలకే వర్తిస్తాయా?అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయా?అని అడిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలనీ, విద్యాసంస్థలను ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.