Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఏడాది నుంచి..
- ప్రయివేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం
- విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
- 'మన ఊరు-మన బడి'కి రూ.7289 కోట్లు
- మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు
- నేడు పంటనష్టం చూసేందుకు సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంలో విద్యా బోధనకు చట్టం చేయాలనీ, వచ్చే విద్యా సంవత్సరం నుంచే దాన్ని అమల్లోకి తేవాలని మంత్రిమండలి నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలోని ప్రయివేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం తీసుకురావాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు అంశాల పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి విధి విధానాలను రూపొందించేందుకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, టీ హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజరు కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కే తారకరామారావు ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే నూతన చట్టాన్ని తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతుల కల్పనకు 'మన ఊరు-మన బడి' ప్రణాళిక అమలు కోసం రూ.7,289 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కరోనా పరిస్థితులు, పంట నష్టం, ధాన్యం కొనుగోలు, విద్యారంగం, నియామకాలు, ఉద్యోగుల బదిలీ లు, రైతుబంధు, తదితర అంశాలపై చర్చించారు. సమావేశ ప్రారంభంలోనే రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు జిల్లాల వారీగా గణాంకాలతో వివరించారు. కరోనా అదుపులో ఉన్నదనీ, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు వైద్యారోగ్యశాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 కోట్ల వాక్సినేషన్ డోసులు ఇచ్చినట్టు తెలిపారు. అలాగే నిబంధనల ప్రకారం అతి త్వరగా 100 శాతం వాక్సిన్ ఇస్తామని చెప్పారు. కరోనా మార్గదర్శకాలు, నిబంధనలు, ప్రభుత్వ ఆంక్షల్ని అమలును ఆయన వివరించారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ అన్నిజిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని, సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అకాల వర్షాలు, పంట నష్టంపై చర్చించారు. పంటనష్టాన్ని తెలుసుకొనేం దుకు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి తాను పర్యటిస్తానని తెలిపారు. వానాకాలం ధాన్యం కొను గోలుపైనా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ళు పూర్తి కావొచ్చాయనీ, అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో ఆలస్యమైందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ మంత్రివర్గం దృష్టికి తీసుకొచ్చారు. ధాన్యం కొనుగోలు పూర్తిగా అయ్యేంతవరకు కేంద్రాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇవి కూడా...
- ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్సిఆర్ఐ)లో డిగ్రీ పూర్తిచేసిన అర్హులైన విద్యార్ధులకు అటవీ శాఖ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ విభాగంలోని ఉద్యోగాల్లో 25శాతం, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విభాగంలోని ఉద్యోగాల్లో 50శాతం, ఫారెస్టర్స్ విభాగంలోని ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. దీనికోసం తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ సర్వీస్ రూల్స్ సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకూ ఆమోదం తెలిపారు.
- రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.