Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెట్టిచాకిరిలో మట్టిగొట్టుక పోతున్న పల్లెల పాలెగాడు
దొరల ఆజ్ఞలకు లొంగిఒంగి నడుమెత్తని అతి బలహీనుడు
అప్పటిదాకా జీవితంలో పశులు, పని తప్ప తీరకలేని జీతగాడు...
ఒక్కసారి పాటై పేలిండు
జనం బాధకు బాణీ అయ్యిండు....
తరతరాల చాకిరికి గోరీ కట్టాలని...
ఊరు ఊరుకు పాటల బండి కట్టిండు...
ప్రజల్ని సంఘంవైపు నిలబెట్టిండు...
అతనే... నాగెల్లి యాదగిరి... కాదు కాదు...
తన పాటలతో పల్లెపల్లె ఉద్యమ జ్వాల రగిల్చిన 'బండి యాదగిరి'. అవును... బండెననక బండి పాటతో అతని పేరే బండి యాదగిరిగా మారిపోయింది. 70దశాబ్దాల క్రితమే మారుమోగి... దొరతనాన్ని పెకిలించిన తూటాగా... ఆ పాటను కైగట్టిన బండి యాదగిరి, నేటికీ అందరి గుండెల్లో, తెలంగాణ చరిత్రలో... చెరగని జన రాగమై మార్మోగుతూనే ఉన్నాడు...
సూర్యాపేట జిల్లా ఎల్కపల్లికి చెందిన యాదగిరికి చదువులేదు. చిన్నతనం నుంచే చాకిరీ తప్పలేదు. ప్రజాకవి సుద్ధాల హన్మంతు ''పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా పాలు మరిచి ఎన్నాళ్లయిందో..'' అంటూ... నాటి బాల్యం బాధలకు అక్షరాల అద్దం పట్టినట్టు చెప్పిన రీతిలోనే... పసుల కాపరిగా, దొర జీతగాడిగా అరికాళ్లకు ముళ్లు... ఎదలో బాధల కన్నీళ్లు అన్నట్టుండే పరిస్థితి యాదగిరిది. వద్దనుకున్నా... పటేళ్ల వద్ద బండ బూతులు, బాధలూ తప్పలేదు. ఈ క్రమంలోనే జనగామా, తిరుమలగిరి, సూర్యాపేట సహా... పలు ప్రాంతాల్లో వెట్టిచాకిరీ నిర్మూలన, దొరల పెత్తనం, నిజాం రాక్షసత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా సంఘటితం అవుతున్నారు. సంఘం జెండా అందుకున్నారు. ఆ ప్రాంతాల్లో పోరాటానికి నేతృత్వం వహిస్తున్న పోరుబిడ్డ బిఎన్ రెడ్డి దళం తమ కార్యక్రమాల్ని విస్తరిస్తూ ఉంది. ఊరూరా ఉద్యమ ఉత్సాహం వెళ్లివిరుస్తోంది. ఈ ప్రభావంతో వెట్టిపీడన పోవాలని, స్వేచ్ఛా, స్వాతంత్య్రం కావాలని సంఘంలో చేరాడు యాదగిరి. తనలాంటి జీతగాళ్ల జీవితాలు మారాలని సాగుతున్న 'జీతగాళ్ల' సంఘంలో చేరి చైతన్యవంతమైన యాదగిరి తర్వాత బిఎన్ రెడ్డి సాయుధ దళంతో కలిసి కర్తవ్య దీక్ష మొదలు పెట్టాడు. కదం కదిపి, పదం అందుకునే తన పాటలకు... పల్లెపల్లే ప్రవాహమె ౖముందుకు ఉరికాయి.
అందరిలాగే... దొరతనంలో విర్రవీగుతూ... జనాన్ని ఏపుకతిన్న ఎర్రపాడు దేశ్ముఖ్ జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి... రజాకార్లు, నిజాంసైన్యం అండలో... ప్రజాపోరును క్రూరంగా అణచివేసే చర్యలకు దిగాడు. దారికి రాని దొర అంతుతేల్చాలని తలచిన ప్రజాదండు, ఓసారి దాడి చేసేందుకు మాటువేసింది. విషయం తెలిసి 16బండ్ల సవారీలో పయనమై తప్పించుకున్నాడు ప్రతాపరెడ్డి. గాలానికి చిక్కిట్టే చిక్కిన చేప తప్పించుకుందంటూ ఆగ్రహంతో రగిలిన బండి యాదగిరి గుండెల్లోంచి పుట్టిన మట్టి పాటే... 'బండెనక బండికట్టి' ఊరూరుకు పాకింది. ఓ పాట శక్తి వందలాది తుపాకి తూటాలకంటే ఎక్కువేనని, అది ఉద్యమ దారిలో ఆటంబాంబులా పేలుతుందని... వీరతెలంగాణ సమరం సాక్షిగా నిరూపించింది ఈ పాట. ఆధునిక ఆయుధాలు, భారీ బలగాలతో పల్లెలపై విరుచుకు పడుతున్న నిజాం దొరల దండును ఎదుర్కొనేందుకు శక్తిగా మారి.. రజాకార్, నిజాం సైన్యాలను తరిమి...
''వడిసెల రాళ్లునింపి - వడివడిగ కొట్టితేనూ
కారాము నీళ్లుదెచ్చి - కండ్లళ్ల జల్లితేనూ
నీ మిల్ట్రి పారిపొయెరో - నైజాం సర్కారోడా'' అంటూ సవాలు చేసిందీ పాట.
ప్రజాపోరాట కేంద్రంగా మారుతున్న తిరుమలగిరి చుట్టుముట్టు ప్రాంతాల్లో తిరుగుబాటును అణచివేసేం దుకు... ప్రత్యేకంగా నిజాం సైనిక క్యాంపులు ఏర్పాటయ్యాయి. మొండ్రాయిలోనూ సైనిక క్యాంపు ఏర్పాటు కాగా... ఆ క్యాంపుల అండతో సాయుధ గెరిల్లాల ఆటలు కట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దొరలు. ఆ క్రమంలో... క్యాంపులకు అదనపు బలగాలు, ఆయుధాలు చేరవేస్తూనే ఉన్నారు. ఓ సారి బలగాలు వస్తున్నాయనే సమాచారం అందుకున్న ప్రజాదళం కాపుగాసి నిజాం సైన్యం వాహనంపై తిరుమలగిరి వద్ద దాడిచేసింది. వారివద్ద ఉన్న ఆయుధాలన్నిటినీ లాక్కుని తరిమికొట్టింది. కొద్దిదూరం పారిపోయిన నిజాంసేన... మొండ్రాయి క్యాంపునుంచి అటుగా వస్తున్న తమ సహచరులు తోడుకావటంతో తిరిగొచ్చి దళంపై కాల్పులకు దిగింది. ఊహించని పరిణామం, శత్రువు బలం అధికంగా ఉండటంతో ప్రజా దండు ప్రాణాలతో బయటపడేందుకు తిరుమలగిరి గుట్టవైపు పరుగుతీయగా... ఈ కాల్పుల్లో తూటాలు తగిలి గాయపడ్డ యాదగిరి నెత్తురోడుతూనే తప్పించుకునేందుకు అరకిలోమీటరు దూరం వరకూ పరిగెత్తి రోడ్డుపక్కన ఉన్న రావిచెట్టు వద్ద ఎర్రజెండాకు జై అంటూ... ప్రాణాలొదిలాడు. తిమలగిరి ఉద్యమ నేలను పాటల బలంతో, తన బలిదానంతో అరుణారుణమయం చేసి, చరిత్రలో నిలిచాడు. తర్వాత కాలంలోనూ తిరుమలగిరి తిరుగుబాటు చైతన్యానికి మారుపేరుగా గుర్తింపు పొందింది.
నాడైనా... నేడైనా... తెలంగాణ అంటేనే పాట. జననం, మరణం, మధ్యలో జీవితం.. అన్నింటిలోనూ పాట ఉంటది. పోరాటాల్లో అయితే ఇక ప్రత్యేకం. కొన్నిసార్లు జనన మరణాల్లో పాట ఉన్నా లేకున్నా... జన పోరాటాల్లో మాత్రం తప్పనిసరి. పోరాటం లేకుండా పాట ఉందేమో కానీ... ఈనేలపై పాటలేని పోరాటం మాత్రం లేదు.
నాటి వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి, నేటి రైతన్నల మహా తిరుగుబాటు, దాని మద్దతు కార్యక్రమాలన్నిటిలో పాటది కీలక భూమిక.
అవును...
ఇక్కడి నేలలో, గాలిలో...
సాగే సాలులో, ఊగే చేలలో...
అడుగు, అడుగులో పిడుగు లాంటి పాట మెరుస్తనే ఉంటది!
పతి బరిలో, ఆ గురిలో...
ఉద్యమ షురిలో, తిరిమల గిరిలో....
అన్యాయంపై అగ్గికణమై యాదగిరి మారుమోగుతూనే ఉంటాడు.
- అనంగారి భాస్కర్ ,9010502255