Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన రహదారులపై ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించండి : అన్ని జిల్లా ఎస్పీలు, సీపీలకు డీజీపీ ఆదేశాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికబద్దంగా ముందుకు సాగాలని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లకు రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం రోడ్డు సేఫ్టీపై ఆయన జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు జీవచ్చవంలా మారుతున్నాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా కుటుంబాలు పోషించే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం మనుగడ ప్రశ్నార్ధకమవుతున్నదని ఆయన అన్నారు. అంతేగాక రోడ్డు ప్రమాదంలో అవయవాలు పోగొట్టుకున్నవారు జీవితకాలం అభాగ్యులుగా మనుగడ సాగించావల్సివస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటిన్నింటికీ మూలకారణమైన రోడ్డు ప్రమాదాలు నివారించడమే ప్రధాన కర్తవ్యం కావాలని ఆయన హితవు పలికారు. ప్రతి ఏడాదిలో జరిగే హత్యలు, అత్మహత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం ఆందోళనకరం అని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డు మార్గాలు, బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు, మరమ్మతులపై దృష్టిని కేంద్రీకరించాలని ఆయన అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల గురించి ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ సంబంధిత శాఖలతో సమన్వయమై నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్, రాష్ట్ర రోడ్ సేఫ్టీ అదనపు డీజీ సందీప్ శాండిల్యా, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.