Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెట్టుపై నుంచి పడటంతో..
నవతెలంగాణ-నూతనకల్/మానకొండూర్/ఇబ్రహీంపట్నం
వృత్తినే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న గీత కార్మికులు.. ఆ వృత్తిలోనే ప్రాణం విడిచారు. ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కింద పడి ఒకే రోజు ముగ్గురు గీత కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనలు మంగళవారం సూర్యాపేట, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో జరిగాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం పెదనెమిల గ్రామానికి చెందిన గుండగాని మధు(35) రోజువారీ పనిలో భాగంగా మంగళవారం తాటిచెట్టుపై గీత పెట్టేందుకు ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఎల్గూరి గోవింద్ మధు మృతదేహాన్ని సందర్శించారు. పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. మృతుని కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని కొండపల్కల గ్రామానికి చెందిన పెరుమాండ్ల మొగిలి(45) కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తూ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన గీత కార్మికుడు సుద్దాల దేవన్న(58) తాటి చెట్టుపై నుంచి పడిపోయాడు. వెంటనే ఆయనను చికిత్స కోసం మెట్పల్లి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు.