Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్యాబినెట్లో కనీసం ప్రస్తావించకపోవడం దారుణం : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రగతిభవన్‌లో సోమవారం సుధీర్ఘంగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలు, ఫలితంగా ఎదురైన ఇబ్బందులపై కనీసం ప్రస్తావించకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. జీవో నెంబర్ 317ని సవరించేదాకా సీఎం కేసీఆర్‌ను వదలబోమని స్పష్టం చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్‌పై ప్రజలు భయాందోళనలకు గురికావొద్దనీ, సమస్య తలెత్తితే వెంటనే డాక్టర్లను సంప్రదించి వైద్యసాయం పొందాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచంలోనే మన దేశం ముందువరుసలో ఉందనీ, ఇప్పటికే 158 కోట్ల డోసులు పూర్తయ్యాయని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తలుచుకుంటే అధోగతిపాలవుతామనే విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గతేడాది ప్రభుత్వ స్కూళ్లకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు బడ్జెట్లో చూపి నయాపైనా విడుదల చేయలేదని గుర్తుచేశారు. ఇప్పుడేమో కార్పొరేట్ పాఠశాల నుంచి డబ్బులు దండుకోవటం కోసమే ఇంగ్లీష్ మీడియం పల్లవి ఎత్తుకున్నారని విమర్శించారు. ప్రధాని నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశానికి ఎందుకు హాజరుకాలేదో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తామని ఇతర రాష్ట్రాల్లో హామీ ఇవ్వలేదని ప్రస్తావించారు. ఉద్యోగాల ఖాళీల గుర్తింపు కోసం మరో కమిటీ వేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మనోహర్‌రెడ్డి, కోశాధికారి బి.శాంతికుమార్, ఎస్సీమోర్చా జాతీయ కార్యదర్శి కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎన్వీ సుభాష్, జె.సంగప్ప, తదితరులు పాల్గొన్నారు.