Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న కేసులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో 72 మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ కోవిడ్ బారిన పడ్డారు. ఇదిలా ఉంటే 12 మంది ప్రొఫెసర్లు, 14 మంది హౌస్ సర్జన్లు, 31 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. దాంతో ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య సేవల కోసం వెళ్లడానికి ప్రజలు జంకుతున్నారు. ప్రాంతీయ కంటి వైద్యశాలలో నలుగురికి పాజిటివ్ రాగా, వారిలో ఇద్దరు ఫార్మసిస్టులు, ఇద్దరు నర్సులు ఉన్నారు. సీకేఎం ప్రసూతి వైద్యశాలలో 19 మందికి కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. ఇందులో 1 అసిస్టెంట్ ప్రొఫెసర్, 4 హౌస్ సర్జన్లు, ఆరుగురు పీజీ డాక్టర్లు, ఇద్దరు హెడ్ నర్సులు, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది, నలుగురు నర్సులు ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. వారందిరికీ డబుల్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తవడమే కాక తాజాగా బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు. కాగా, ఎంజీఎం ఆస్పత్రిలో 15 మంది కోవిడ్ ఇన్‌పేషంట్లు మాత్రమే ఉన్నారు. ఏదేమైనా పెద్దాస్పత్రుల్లోనే కరోనా విజృంభించడంతో సిబ్బంది, వైద్యసేవలకు వచ్చే రోగులు బేంబెలెత్తిపోతున్నారు.
నగరంలోనూ పెరుగుతున్న కేసులు
గ్రేటర్ వరంగల్ నగరంలోనూ కోవిడ్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి కోవిడ్ బారినపడ్డారు. హన్మకొండ న్యూశాయంపేట అర్బన్ హెల్త్ సెంటర్లో సోమవారం 45 పాజిటివ్ కేసులు వచ్చాయి. స్వల్ప లక్షణాలు కనిపిస్తే ప్రజలు ప్రయివేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తుండటంతో వాస్తవ గణాంకాలు రావడం లేదని తెలుస్తున్నది.