Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఇంటి పార్టీ మహిళా అధ్యక్షురాలు చెరుకు లక్ష్మి
- ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చిన్నజీయర్ స్వామి దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-నల్లగొండ
బడుగుల ఆహారపు అలవాట్లపై, వారి కులాల గురించి మాట్లాడే హక్కు చిన్న జీయర్ స్వామి లేదని తెలంగాణ ఇంటి పార్టీ మహిళా అధ్యక్షురాలు చెరుకు లక్ష్మి అన్నారు. దళితులను, బడుగులను హేళన చేస్తూ, కించపరిచేలా మాట్లాడటాన్ని నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం వద్ద చిన్నజీయర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా చెరుకు లక్ష్మీ మాట్లాడుతూ.. పంది మాంసం తినే మనిషికి పంది బుద్ధులు వస్తాయని చిన్న జీయర్‌స్వామి అనడం సరైనది కాదన్నారు. అలాగే, మేక మాంసం తినేవాడు బుర్ర లేకుండా మేకల మందలాగా వెళతారు అనడమంటే.. మాంసాహారులను కించపరచడమే అన్నారు. సబ్బండ వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన చిన్నజీయర్ స్వామిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కెేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. మాంసాహారులను, కింది కులాలను ఉద్దేశించి చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ దళితుల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని అన్నారు. ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు పందుల సైదులు మాట్లాడుతూ.. చిన్నజీయర్ వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పీడీఎస్‌యూ, టీఎస్‌యూ బాధ్యులు ఇందూరి సాగర్, కొండేటి మురళి, రైతు కూలీ సంఘం నాయకులు కొమరయ్య, సీఐటీయూ నాయకులు దండెంపల్లి సత్తయ్య, కత్తుల చంధన్, సంగపాక సతీష్, ముక్కాముల శ్రీనివాస్ పాల్గొన్నారు.