Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు 'మన ఊరు-మనబడి' పథకాన్ని అమలు చేసేందుకు రూ.7,289 కోట్లు ఖర్చు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని నాలుగు పాఠశాలల్లో పనులను చేపట్టినట్టు వివరించారు. ఈ పనుల పనితీరుపై మంగళవారం ఆమె తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి, జిల్లెలగూడ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, హైదరాబాద్ జిల్లాలోని ఆలియా, మహబూబియా (బాలికల) ఉన్నత, ప్రాథమిక పాఠశాలల నిర్మాణాల కోసం రూ.3.57 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే 40 శాతం పూర్తయ్యాయని చెప్పారు. వాటి భవనాలను ఇతర పాఠశాలలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పిస్తున్నామని చెప్పారు. ప్రహరీగోడలు, తరగతి గదుల మరమ్మత్తులు, అదనపు గదుల నిర్మాణాలను చేపట్టామని వివరించారు. పాఠశాలలకు విద్యుదీకరణ, పూర్తిస్థాయి నీటిసరఫరా, పెయింటింగ్ వంటి పనులను చేపట్టామని అన్నారు. భావితరాల ప్రయోజనాల పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. కేజీ టు పీజీ వరకు విద్యార్థికి నాణ్యమైన ఉచిత విద్యను అంకితభావంతో అందించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మెన్ నాగేందర్‌గౌడ్, ఎండీ పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.