Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 వరకు సెలవులు పొడిగింపు సరికాదు: తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ విమర్శించింది. ఈ మేరకు పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కె లక్ష్మినారాయణ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్ కేటాయింపులు, ఖాళీల భర్తీ, కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. 317 జీవోతో టీచర్ల జీవితాలతో ఆడుకోవడమే కాకుండా ఎక్కడెక్కడికో బదిలీ చేసిందని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్యను చూపి కొన్ని పాఠశాలల్లో మాత్రమే పోస్టింగ్లు ఇచ్చారని తెలిపారు. చాలా పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించలేదని విమర్శించారు. భవిష్యత్తులో ఆ పోస్టులు అనివార్యంగా రద్దయిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా పేరుతో ఈనెల 30 వరకు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులను పొడిగించిందని తెలిపారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమాలకు లేని నియంత్రణ విద్యారంగానికే విధించడం సరైంది కాదని పేర్కొన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు పాఠశాలల్లో తగిన చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో కరోనా నియంత్రణ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. స్కావెంజర్లను నియమించాలనీ, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, మాస్క్లు, సబ్బులు సరఫరా చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలకూ ఒక ఆరోగ్య కార్యకర్తను నియమించాలని కోరారు. కనీసం ఉన్నత పాఠశాలలను ప్రారంభించాలనీ, పిల్లలకు విద్యనందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.