Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫెడరేషన్ ఆఫ్ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటీవ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎంఆర్ఏఐ) ఆధ్వర్యంలో మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్‌లు దేశవ్యాప్తంగా బుధవారం నిర్వహించ తలపెట్టిన సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, ఎం.సాయిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మెను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. సమ్మెకు కార్మిక, ప్రజాసంఘాలు మద్దతు తెలుపాలని కోరారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్, కండీషన్స్ ఆఫ్ సర్వీసెస్ యాక్టు-1976ను అమలు చేయాలనీ, మెడిసిన్‌పై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ఐదుశాతం నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వరంగ వ్యాక్సిన్, మందుల కంపెనీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనీ, అమ్మకాలు తగ్గాయనే పేరుతో వర్కర్లను యాజమాన్యాలు తొలగించడాన్ని అడ్డుకోవాలని సూచించారు. వర్కర్ల తొలగింపులు ఆపేయాలనీ, ఆన్లైన్లో మందుల అమ్మకాలను ఆపాలని కోరారు. మందుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
సమ్మెకు సీసీజీఈడబ్ల్యూ మద్దతు
మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్‌ల సమ్మెకు తమ యూనియన్ ఏపీ, తెలంగాణ శాఖల తరఫున మద్దతు తెలుపుతున్నట్టు కాన్ఫిడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వర్కర్స్(సీసీజీఈడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.నాగేశ్వర్రావు, ఎ.అజీజ్ ఒక ప్రకటనలో తెలిపారు.