Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరికి తీవ్రగాయాలు
- వర్షాలకు నేలనానడంతోనే..
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నగరంలోని 26వ డివిజన్ బ్రాహ్మణబజార్‌లో మంగళవారం సాయంత్రం ఓ భారీ రావిచెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల మూడురోజులు చెదురుమదురు వర్షాలు కురవడంతో దాదాపు 80 ఏండ్ల వయసున్న ఓ రావిచెట్టు వేళ్ల భాగం బాగా నానింది. దీనికితోడు ఆ చెట్టు వేళ్లు కూడా కుళ్లిపోవడంతో అనూహ్యంగా నేలమట్టమైంది. స్థానికంగా ఓ పూజ దుకాణం యజమానికి చెందిన ప్లాట్‌ను ఇటీవల ఓ వస్త్రదుకాణం వారు పార్కింగ్ నిమిత్తం లీజుకు తీసుకున్నారు. మూడురోజుల కిందట ఆ ప్లాట్‌ను శుభ్రం చేయించారు. రాజస్థాన్ నుంచి వలస వచ్చి దాదాపు 50 ఏండ్లుగా బ్రాహ్మణబజార్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్న మార్వాడీ కుటుంబాల పిల్లలు, మరికొందరు స్థానిక పిల్లలతో కలిసి శుభ్రం చేసిన ప్లాట్‌లో క్రికెట్ ఆడుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో చెట్టు నేలకొరుగుతుండటాన్ని గమనించి అక్కడే ఆటాడుతున్న ఆరుగురు పిల్లలు తలా ఒక్క దిక్కు పరుగులు తీశారు. చెట్టు మొదలుకు సమీపంలో ఉన్న లిగావత్ షెట్టి (11), రాజపుత్రో ఆయుష్ (6)పై నేరుగా చెట్టు పడింది. పక్కనే ఉన్న గోడపైన కూడా పడటంతో ఆ గోడ కూడా కూలింది. ఇటు చెట్టు, అటు గోడ ఇటుక పెళ్లలు మీద పడటంతో లిగావత్ షెట్టి, ఆయుష్ అక్కడికక్కడే మృతిచెందారు. ఆయుష్ అన్నయ్య అనుమోలు (13)కు తలకు బలమైన గాయమవడంతో ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యసేవలందిస్తున్నారు. మరో చిన్నారి చరణ్ (8)కు కాళ్లుచేతులు విరిగడంతో స్థానిక కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇంకో చిన్నారి సాయి సాకేత్, సాయి ఆర్యన్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. తన డివిజన్‌లోనే చోటుచేసుకున్న ఘటన విషయం తెలిసి మేయర్ పునుకొల్లు నీరజ హుటాహుటిన ఘటనాస్థలిని సందర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన పిల్లలు ఆకస్మికంగా దుర్మరణం చెందడంతో పిల్లల తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా స్థానికులు మేయర్‌ను కోరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల వైద్యఖర్చులు భరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మృతులు లిగావత్ షెట్టి తండ్రి దినకర్ షెట్టి స్థానికంగా ఓ హౌటల్లో పనిచేస్తున్నాడు. ఆయుష్ తండ్రి ప్రకాశ్ కళ్లజోళ్ల షాపు నిర్వహిస్తున్నాడు.