Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకుంటే దశలవారీగా ఉద్యమం: గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వివిధ శాఖల్లోని పర్మినెంట్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెంచినట్టుగానే గ్రామపంచాయతీ సిబ్బందికీ జీతాలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్లో జేఏసీ సమావేశం జరిగింది. అందులో జేఏసీ నేతలు పాలడుగు భాస్కర్, జి.పాండు(సీఐటీయూ), ఎమ్డీ యూసుఫ్ జయచంద్ర, టి.నర్సింహారెడ్డి, వెంకటరాజ్యం(ఏఐటీయూసీ), సాంబశివుడు, ఎం.రవికుమార్ (ఐఎఫ్టీయూ), కె.స్వామి, శివబాబు (ఐఎఫ్టీయూ), బాబూరావు, ఆంజనేయులు (ఏఐయూటీయూసీ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జీఓ 60 ప్రకారం జీపీ కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన జీపీ సిబ్బందిని నియమించాలని కోరారు. జీవో 51ని సవరించాలనీ, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలనీ, కేటగిరీల వారీగా యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్కలెక్టర్లకు ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పీఎఫ్, ఈఎస్ఐలతో పాటు ఎస్క్డే ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలనీ, ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ ఉద్యోగ, భద్రత కల్పించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపట్టాలనీ, ఈ నెల 24న సర్పంచులకు వినతులివ్వాలని పంచాయతీ కార్మికులకు పిలుపునిచ్చారు. 27న ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలకు వినతిపత్రాలిచ్చి మండలకేంద్రాల్లో ధర్నాలు చేయాలన్నారు. 31న పంచాయతీరాజ్ మంత్రి, కమిషనర్లకు వినతులివ్వాలనీ, ఫిబ్రవరి తొమ్మిదో తేదీన హైదరాబాద్లో రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు.