Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలా చేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమే
- కౌంటర్ వేయకపోతే సీఎస్ హాజరు కావాల్సిందే : హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పదుల సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకుండా జీతాలు చెల్లించడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. కొన్ని నెలలుగా జీతాలిస్తూ వాళ్ల సేవల్ని వినియోగించకపోవడం దారుణమని వ్యాఖ్యానించింది. పోస్టింగ్ ఇచ్చే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. సమగ్ర వివరాలతో కౌంటర్ వేయాలని రాష్ట్రానికి మళ్లీ నోటీసులు ఇచ్చింది. కౌంటర్ వేయకపోతే తదుపరి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా విచారణకు హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా జీతాలివ్వడం వేధింపుల కిందకే వస్తుందంటూ హైదరాబాద్ నగరానికి చెందిన రిటైర్డు కేంద్ర ఉద్యోగి నాగేందర్ సింగ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. 2020లో దాఖలు చేసిన పిల్లో ఇప్పటి వరకు ప్రభుత్వం కౌంటర్ వేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 నెలలు గడిచినా ఇప్పటికీ ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. సీఎస్ స్థాయి ఉన్నతాధికారే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగని తప్పుపట్టింది. వచ్చే మార్చి 14లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. లేకపోతే సీఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాలని తేల్చి చెప్పింది. ఏయే ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాల్లో ఎంత మంది అధికారులకు పోస్టింగ్ లేకుండా జీతాలు చెల్లిస్తున్నారో చెప్పాలని కోరింది. ఈమేరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ విభాగాల్లో దాదాపు 40 నుంచి 50 మంది అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ప్రభుత్వం జీతాలు చెల్లింస్తోందని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. ఈ పిటిషన్‌పై సీఎస్ ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. కౌంటర్ దాఖలుకు ఇప్పటికే అనేకసార్లు వాయిదా కోరారని గుర్తు చేశారు. వెంటనే పోస్టింగులు అందరికీ ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలనీ, వారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఉన్న ఉన్నతాధికారి నుంచి అధికారులకు ఇచ్చిన జీతాలను వసూలు చేయాలని కోరారు. మూడు కోట్ల రూపాయల వరకు పోస్టింగ్‌లు ఇవ్వని అధికారులకు జీతాలు ఇచ్చారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ న్యాయవాది కల్పించుకుని కౌంటర్ దాఖలుకు నాలుగు వారాలు గడువు ఇవ్వాలని కోరారు. దీనిపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 'పోస్టింగ్ ఇవ్వరు..విధులు నిర్వహించకపోయినా జీతాలు చెల్లించే స్తారు..ఇలా చేయడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే కదా? ప్రజాధనం వృథా చేయడమే కదా? కౌంటర్ దాఖలుకు ఇదే ఆఖరి అవకాశం. మళ్లీ గడువు ఇచ్చే ప్రసక్తే లేదు. మార్చి 14వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలి. కౌంటర్ దాఖలు చేయకపోతే సీఎస్ స్వయంగా విచారణకు రావాలి' అని హైకోర్టు ఉత్తర్వుల్లో ఆదేశించింది.
జీవో నెంబర్ 317పై స్టే ఇవ్వలేం
తుది తీర్పునకు లోబడే జీవో అమలు : హైకోర్టు
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుల జీవో 317పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అయితే, తామిచ్చే తుది తీర్పునకు లోబడి జీవో 317 అమలు అవుతుందని చెప్పింది. స్టే ఇవ్వకపోయినప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయలు తమ బదిలీలపై వ్యక్తిగతంగా ఎదురయ్యే సమస్యలపై విడిగా రిట్లు దాఖలు చేసుకోవచ్చునని సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సీనియారిటీకి విరుద్ధంగా తమను కొత్త జిల్లాలకు కేటాయించారంటూ పలువురు ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు మంగళవారం మళ్లీ విచారణ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు, సీనియారిటీకి విరుద్ధంగా, కోరుకున్న చోటకు బదిలీలు చేయకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని పిటిషనర్ల న్యాయవాదులు వాదించారు. పిటిషనర్లకు తీరని అన్యాయం జరిగేలా కేటాయింపులు చేశారని చెప్పారు. కొత్త జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులంతా విధుల్లో చేరారని ప్రభుత్వం చెప్పింది. అన్ని కేసుల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ నాలుగో తేదీకి వాయిదా వేసింది.