Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి సబిత ఆదేశం
- త్వరలో ప్రభుత్వానికి నివేదిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
త్వరలోనే వండేండ్లు పూర్తి చేసుకోబోతున్న కోఠి మహిళా కళాశాలను రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చే అంశంపై మంగళవారం ఆమె కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు, ఉన్నత విద్యామండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండి యూజీసీ స్వయం ప్రతిపత్తితో, న్యాక్ గుర్తింపు ఉన్న కోఠి మహిళా కళాశాలను, మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని అర్హతలూ కలిగి ఉందంటూ ప్రభుత్వం భావించిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళా విశ్వవిద్యాలయ ఏర్పాటును వేగవంతం చేసే దిశగా పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమయ్యే బోధనా సౌకర్యాలు, విద్యార్థుల వసతులు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై కూలంకషంగా పరిశోధించి నివేదికను రూపొందించాలని కోరారు. మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు విధివిధానాలు, అనుమతుల గురించి వివరాలు అందించే దిశగా చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖలో అంతర్గత కమిటీ వేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కోఠి మహిళా కళాశాలలో 4,159 మంది విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. దీన్ని మహిళా విశ్వవిద్యాలయంగా మారిస్తే ఈ సంఖ్య పెరిగే అవకాశమున్నందున, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కాలేజీకి చారిత్రక వైభవం ఉన్నందున మహిళా విశ్వవిద్యాలయంగా మారిస్తే మహిళలకు ఉన్నత విద్యలో మహర్ధశ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యలో హైదరాబాద్ అంతర్జాతీయస్థాయిలో దూసుకెళ్తున్నదని వివరించారు. ఈ విశ్వవిద్యాలయం వల్ల మరింత పేరు, ప్రఖ్యాతులు వస్తాయన్నారు. ఈ వర్సిటీలో ఆధునిక కోర్సులు బోధించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధంచేసి త్వరలోనే ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్, ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మినారాయణ, కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ విజులత తదితరులు పాల్గొన్నారు.