Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనిపించని సంక్రాంతి శోభ
- సాధారణ రోజుల్లో రోజువారీ ఆదాయం రూ.11.50 కోట్లు
- పండుగ సీజన్లో రోజువారీ ఆదాయం రూ.9.75 కోట్లే
- పదిరోజుల్లో వచ్చింది రూ.107.31 కోట్లే
- ఆదనంగా 4వేల బస్సులు తిప్పినట్టు సంస్థ ప్రకటన ొ మరి ఆదాయం ఏదీ?
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సంక్రాంతి సీజన్లో టీఎస్ఆర్టీసీ ఆదాయం గణనీయంగా తగ్గింది. మామూలు రోజుల్లో వచ్చే ఆదాయం కంటే, పండుగ సెలవురోజుల్లో వచ్చిన ఆదాయం, 4వేల బస్సుల్ని అదనంగా తిప్పినా రాకపోవడం గమనార్హం. సంక్రాంతి పండుగకు ముందు ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.10.50 కోట్ల నుంచి రూ.11.50 కోట్ల వరకు ఉంది. సంక్రాంతి సీజన్ పేరుతో అదనంగా 4 వేల బస్సుల్ని తిప్పినా, రోజువారీ ఆదాయం రూ.9.75 కోట్లు మాత్రమే వచ్చింది. ఈనెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పదిరోజుల్లో సంస్థ ఆదాయం రూ.107.31 కోట్లుగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. అంటే సరాసరి రోజువారీ ఆదాయం రూ.9.75 కోట్లు మాత్రమే. పండుగ సీజన్ అంటే సహజంగా ఏటా జనవరి 11 నుంచి 17 వరకు లెక్కిస్తారు. కానీ ఈ సారి సంస్థ ఆదాయం రూ. వంద కోట్లు దాటిందని చెప్పే ప్రయత్నంలో జనవరి 7 నుంచి 17వ తేదీ వరకు ఆదాయాన్ని లెక్కించి, రూ.107.31 కోట్లు వచ్చినట్టు యాజమాన్యం పేర్కొంది. పండుగ సీజన్ కాని జనవరి 7 తేదీన సంస్థ ఆదాయం రూ.12.04 కోట్లు. 8వ తేదీ ఆదాయం రూ.11.89 కోట్లు. 9వ తేదీ (ఆదివారం) 9.80 కోట్లు. 10వ తేదీ ఆదాయం రూ.11.04 కోట్లు. ఆ తర్వాతి రోజుల్లో 12, 13 తేదీల్లో మాత్రమే సంస్థ రోజువారీ ఆదాయం రూ.10 కోట్లు దాటింది. (ఇది సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయం కంటే తక్కువ). ఈ లెక్కల్ని పరిగణనలోకి తీసుకుంటే అసలు ప్రత్యేక బస్సులు తిరిగాయా లేదా అనే సందేహమూ కలుగుతుంది. కానీ యాజమాన్యం మాత్రం ఈ సీజన్లో 4వేల ప్రత్యేక బస్సులు తిప్పి, 55 లక్షల మంది ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకు చేర్చామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీని ప్రయాణీకులు ఆదరిస్తున్నారని సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ చెప్తున్నారు. కానీ పండుగ సీజన్లో సాధారణ రోజులకంటే ఆదాయం ఎందుకు తక్కువయ్యిందనే దానిపై స్పష్టత లేదు. రోజువారీ సాధారణ సర్వీసుల అదాయం, ప్రత్యేక బస్సుల ఆదాయం వేర్వేరుగా విభజించి లెక్కిస్తే లోపం ఎక్కడుందో అర్ధమవుతుందని ప్రజా రవాణా నిపుణులు చెప్తున్నారు.
థ్యాంక్స్ : ఆర్టీసీ యాజమాన్యం
''సంక్రాంతి పండగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థమై షెడ్యూల్ బస్సులతోపాటు నాలుగు వేల బస్సులను అదనంగా నడిపించింది. దాదాపు 55 లక్షల మంది ప్రయాణీకులను ఎలాంటి అధనపు చార్జీలు లేకుండా ప్రజా సేవయే లక్ష్యంగా వారిని గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాము. సంక్రాంతి పండగ సందర్భంగా సంస్థకి రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది'' అంటూ టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో ప్రయాణీకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు కూడా ఇదే విధంగా టీఎస్ఆర్టీసీని అదరిస్తూ సంస్థ అభివృద్దికి చేయూతనివ్వలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రోజువారీ ఆదాయం ఇలా...(కోట్లలో)
తేదీ వారం ఆదాయం
07-01-2022 శుక్రవారం 12.04
08 శనివారం 11.89
09 ఆదివారం 9.80
10 సోమవారం 11.04
11 మంగళవారం 9.66
12 బుధవారం 10.03
13 గురువారం 10.36
14 శుక్రవారం 8.12
15 శనివారం 5.62
16 ఆదివారం 6.49
17 సోమవారం 12.21
మొత్తం 107.31
రోజువారీ సరాసరి ఆదాయం 9.75
(వేలల్లో అడ్జస్ట్మెంట్ తర్వాత)