Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మావోయిస్టులు మృతి
- గ్రేహౌండ్ కానిస్టేబుల్కు గాయాలు
నవతెలంగాణ-వెంకటాపురం
ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జేఎండబ్యూపీ (జయశంకర్, ములుగు, వరంగల్, పెద్దపల్లి) జోన్ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. దాంతో రెండు రాష్ట్రాల సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, డీఆర్జీ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తూ సమావేశం జరుగుతున్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టుల నడుమ గంటన్నరకుపైగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్టు పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయని వివరించారు. కాల్పుల్లో ఒక జవాన్ గాయపడగా హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్టు తెలిపారు. ఘటనా స్థలిలో ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, సింగిల్ బోర్ తుపాకీతోపాటు 10 రాకెట్ లాంచర్లు, కిట్ బ్యాగులు లభ్యమయ్యాయని తెలిపారు. కాగా, మృతి చెందిన మహిళ మావోయిస్టు.. వెంకటాపురం వాజేడు కమిటీ కార్యదర్శి శాంతక్కగా, మరొకరు బుచ్చయ్యగా ప్రచారం సాగుతోంది.