Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీహెచ్కు పాజిటివ్
- ప్రభుత్వాస్పత్రుల్లో పదుల సంఖ్యలో డాక్టర్లు, నర్సులకూ
- సిబ్బంది కొరతతో రోగులకు ఇబ్బందులు
- డోసుల మధ్య గడువు తగ్గించాలి
- కేంద్రానికి మంత్రి హరీశ్ రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా కలకలం రేపుతోంది. రాజకీయ నాయకులకు ఒకరి తర్వాత ఒకరికన్నట్టు సోకుతున్న వైరస్ అదే స్థాయిలో ఆయా శాఖల ముఖ్య కార్యాలయాల సిబ్బందిని వదిలి పెట్టడం లేదు. రాష్ట్ర సచివాలయం నడుస్తున్న బీఆర్కె భవన్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, పోలీసు సిబ్బంది ఇలా అన్ని విభాగాల్లో తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావుకు స్వల్ప లక్షణాలు రాగా టెస్టులో వైరస్ సోకినట్టు బయటపడింది. సాధారణ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి కె.శ్రీనివాసరాజుతో ఆయా కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిలో పదుల సంఖ్య వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటికే గాంధీ, ఉస్మానియా, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల, నిలోఫర్ తదితర ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు వందల సంఖ్యలో దీని బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోనూ దాదాపు 70 మందికి పైగా సిబ్బందికి పాజిటివ్ రావడం, మిగిలిన బోధనాస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. ఒకవైపు రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటం, మరోవైపు వైద్యసిబ్బందిలో ఎక్కువ మంది క్వారంటైన్ లోకి వెళ్లిపోతుండటంతో వైద్యసేవలకు అంతరాయం కలుగుతున్నది. క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ స్వల్ప లక్షణాలు కలిగిన సిబ్బందికి పరీక్షలు చేస్తే పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో ప్రజలు మరింతజాగ్రత్తగా ఉండా లని డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు కోరారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాస్పత్రుల్లో నాన్-కోవిడ్ సేవలను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేయడం దుర్లభంగా మారిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న సిబ్బందిలో ఎక్కువ మంది పాజిటివ్ బారినపడ టం, అత్యవసరకేసులు తప్పనిసరిగాచూడటంతో మిగిలినసేవలు నామమాత్రం గా ఉన్నట్టు చెబుతున్నారు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో డాక్టరుకు పాజిటివ్వస్తే అందుకుప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడాచేయలేదు. దీంతో వచ్చే రోగులను నర్సులు, ఫార్మాసిస్టులు మందులిచ్చి పంపిస్తున్నారు. ఎట్టి పరిస్థి తిల్లోనూ సేవలునిలిచిపోవని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం వైద్యసిబ్బందిలో పాజిటివ్ పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై మాత్రం శ్రద్ధ చూపించినట్టు లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనాతో పాటు ఇతర వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
డోసుల మధ్య గడువు తగ్గించాలి : కేంద్రానికి మంత్రి హరీశ్ రావు లేఖ
మరోవైపు కరోనా రెండో డోసు, ప్రికాషనరీ డోసు మధ్య గడువును తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు లేఖ రాశారు. ఆరోగ్య సిబ్బందికి ఈ గడువును మూడు నెలలకు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర వ్యాధులతో సంబంధం లేకుండా 60 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి మూడో డోసును ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోసు పాలసీలు, వాటి ఫలితాల ఆధారంగా తన ప్రతిపాదనలున్నాయని మంత్రి తెలిపారు.
2,983 మందికి కరోనా
రాష్ట్రంలో కొత్తగా 2,983 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 1,07,904 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 13,895 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,472 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 1,206 మందికి కరోనా సోకింది. కాగా సోమవారంతో పోలిస్తే మంగళవారం జీహెచ్ఎంసీతో సహా 30 జిల్లాల్లో కేసులు పెరిగాయి. ములుగు, సిద్ధిపేట, వనపర్తి జిల్లాల్లో కేసులు తగ్గాయి. పాజిటివ్ రేటు 2.76 శాతంగా నమోదయింది.