Authorization
Tue April 08, 2025 09:50:47 am
- మంత్రుల కాళ్లపై రైతులు.. ఉప్పల్తండాలో ఆందోళన
- అండగా ఉంటామన్న మంత్రి నిరజంన్‌రెడ్డి
- ఉమ్మడి వరంగల్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం పర్యటన
నవతెలంగాణ-నర్సంపేట/పరకాల/నడికూడ
వడగండ్ల వానలతో పూర్తిగా నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు మంత్రుల కాళ్లపై పడి వేడుకున్నారు. వరంగల్ జిల్లాలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను మంగళవారం మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా తమ ఆవేదనను మంత్రుల ముందు వెళ్లబోసుకున్నారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట, పరకాల, నడికూడ మండలాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ధర్మారెడ్డిలతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి మంగళవారం పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నడికూడ మండలం నర్సక్కపల్లిలో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. ఉప్పల్తండాలో కొంతమంది రైతులు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి హామీతో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు నష్టాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ మేరకు నష్టపరిహారంపై ఒకటి రెండ్రోజుల్లో వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు. వెంటనే సర్వే చేసి పంట నష్టంపై పూర్తి స్థాయి నివేదికలను రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించామని వివరించారు. రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని చెప్పారు.