Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
- పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
- కరోనా కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఈ నెల 22 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో నిర్వహించనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాల గూడ పట్టణకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఈనెల 22న సాయంత్రం నాలుగు గంటలకు ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పోలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్, రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొంటారని తెలిపారు. 23, 24, 25 తేదీల్లో పరిమితంగా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తులో చేపట్టబోయే పోరాటాలు, ఉద్యమాల కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతి న్నాయనీ, ముఖ్యంగా మిర్చి పంటకు తామర వైరస్, బూడిద తెగులు సోకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు తెలిపారు. ఎకరానికి రూ.75 వేల చొప్పున పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పంట వివరాలను సేకరించాలని సూచించారు. కౌలు రైతులకు పంటల బీమా, రైతు బీమా, రైతుబంధు వంటి పథకాలు అమలు చేయకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీడు భూములకు రైతుబంధు ఇస్తున్న ప్రభుత్వం కౌలు రైతుల విషయంపై సానుకూలంగా స్పందించారని కోరారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా గ్రామాలు, వార్డుల వారీగా మొబైల్ టీమ్లను ఏర్పాటుచేసి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించి ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించాలని సూచించారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బీకార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీర్లపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, పగిదోజు రామ్మూర్తి, వినోద్ నాయక్, బాబు నాయక్, గోలి వెంకట్ రెడ్డి, పథాని శ్రీనివాస్ పాల్గొన్నారు.