Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిన్న రూ.2వేల కోట్లు.. నేడు రూ.7,289 కోట్లు...
- విద్యా వ్యవస్థపై సర్కారు తీరిది..
- అమలుకు నోచుకోని కామన్‌స్కూల్ విధానం
- ఇప్పుడు కొత్తగా 'మన ఊరు-మనబడి' పథకం
- మౌలిక వసతుల కల్పనకు రూ.7,289 కోట్లు
- సర్కారు బడులు బాగుపడేదెన్నడో...
- ఏటా రూ.2 వేల కోట్ల ముచ్చట ఎటుపాయే
- ఇప్పటి వరకూ ఒక్క రూపాయి విడుదల కాలే
- రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సర్వత్రా చర్చ
బొల్లె జగదీశ్వర్
'ప్రాథమిక స్థాయి నుండే పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో విద్యనందించాలి. పేదలు, ధనవంతులు అనే తేడా లేకుండా పిల్లలందరూ ఒకే స్కూల్లో నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ మీడియంలో అభ్యసించేలా విధానాన్ని రూపొందించాలి. ఐఏఎస్ అధికారుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, నిరుపేద పిల్లలు ఒకే స్కూల్లో చదవాలి. ఒకే రకం యూనిఫాం వేసుకోవాలి. వారందరికీ ఒకే రకమైన విద్య అందాలి. కేజీ టు పీజీ వరకు పిల్లలకు మంచి విద్య అందించడం కోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి'అని 2014, నవంబర్ 29న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.
'అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాల్లో మాదిరిగా తెలంగాణలో స్థాయిబేధం లేకుండా అన్ని వర్గాల వారూ ఒకేచోట విద్యనభ్యసించే కామన్ స్కూల్ విధానం తీసుకురావడం నా పెద్ద కల. బడిలోనే విద్యార్థి భవితకు బాటలు పడతాయి. ప్రభుత్వాలు ఇప్పటి వరకు అనుసరించిన అడ్డగోలు విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది. ప్రజలు ప్రయివేటు పాఠశాలలపైనే నమ్మకం ఉంచాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ప్రయివేటు పాఠశాలల నుంచి పిల్లలు సర్కారు బడికి బాట పట్టే వాతావరణం రావాలి. అమెరికా అధ్యక్షుని కొడుకూ ఆ దేశంలోని కామన్ స్కూల్లోనే చదువుతాడు. తెలంగాణలో ఆ పరిస్థితి రావాలి'అని 2014, జులై 26న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు.
'తెలంగాణలో కార్పొరేట్ విద్యావ్యాపారాన్ని అరికడతాం. కార్పొరేట్ విద్యావ్యవస్థను నియంత్రిస్తాం'అని ఉద్యమ నేతగా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ హామీ ఇచ్చారు. 'తెలంగాణలో విద్యారంగాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా ఉన్నతీకరిస్తూ రూ.నాలుగు వేల కోట్లతో సరికొత్త విద్యాపథకాన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. రాబోయే రెండేండ్లలో రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్మాణం పెద్దఎత్తున ప్రభుత్వం చేపట్టబోతున్నది. పాఠశాలలకు అవసరమైన భవనాలు, వాటి మరమ్మతులు, కావాల్సిన ఫర్నీచర్, టారులెట్లు వంటి వసతులు కల్పించాలని నిర్ణయించింది. ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పాఠశాల తరగతులను అనుసంధానం చేస్తుంది. ఈ బృహత్తర విద్యాపథకం కోసం ఈ సంవతవ్సరం రూ.రెండు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం'అని 2021-22 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలా పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు విద్యారంగం అభివృద్ధి గురించి ప్రస్తావించడం, ఆ తర్వాత మరిచిపోవడం ఆనవాయితీగా వస్తున్నది. పూటకోమాట మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. అంతేతప్ప చిత్తశుద్ధితో ఇచ్చిన హామీల అమలుకు పూనుకోవడం లేదు. గత మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.రెండు వేల కోట్లు కేటాయించారు. ఈ విద్యాసంవత్స రంలో ఇప్పటి వరకూ ఒక్క రూపాయి విడుదల చేయలేదు. మాటలేమో కోటలు దాటుతాయి... చేతలేమో గడప దాటదు అన్న చందంగా ప్రభుత్వ తీరు ఉన్నది. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యాపథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం ఈ అంశంలో అటకెక్కించింది. కేవలం గురుకులాలకే కేజీ టు పీజీ పథకాన్ని పరిమితం చేసింది. అదీ 2014లో 298 ఉన్న గురుకులాల సంఖ్యను ప్రస్తుతం 970కి పెంచింది. వాటికి సొంత భవనాలు, అవసరమైన బోధన, బోధనేతర సిబ్బంది, మౌలిక వసతుల కల్పనను ప్రభుత్వం మరిచిపోయింది. కార్పొరేట్ విద్యావ్యాపారాన్ని నియంత్రిస్తామని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శ ఉన్నది. కామన్ స్కూల్' విధానం అమలుకు నోచుకోలేదు. ఇలా అనేక హామీలివ్వడం, వాటిని మరిచిపోవడం పరిపాటిగా మారింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,289 కోట్లతో 'మన ఊరు-మనబడి' పథకాన్ని ప్రకటించడం పట్ల సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. పలు అంశాలను చర్చించి విధివిధానాలను రూపొందించింది. ఇప్పటి వరకు మార్గదర్శకాలను విడుదల చేయలేదు. దీంతో ఈ పథకమైనా అమల్లోకి వస్తుందా?, సర్కారు బడులు బాగుపడతాయా?అనే అనుమానాలు కలుగుతున్నాయి.
మొదటిదశలో 9,123 స్కూళ్లు ఎంపిక
రాష్ట్రంలో 26,085 ప్రభుత్వ పాఠశాలల్లో 19,84,167 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ పాఠశాలల బాగుకోసం ప్రభుత్వం ప్రస్తుత విద్యాసంవత్సరంలో రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో 25 శాతాన్ని బడుల్లో మౌలిక వసతుల కల్పనకు కేటాయించాలని నిర్ణయించింది. 2021-22 విద్యాసంవత్సరంలో మొదటి దశలో మండల కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని అత్యధికంగా విద్యార్థులున్న 9,123 పాఠశాలలను ఎంపిక చేసింది. మన ఊరు-మనబడి కార్యక్రమంలో 12 రకాల విభాగాలను పటిష్టపరచాలని నిర్ణయించింది. నీటి సౌకర్యంతో కూడిన టారులెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరపడా ఫర్నీచర్, పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం, పెద్ద, చిన్న మరమ్మత్తులు, గ్రీన్‌చాక్ బోర్డులు, ప్రహరీగోడలు, కిచెన్షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు, డిజిటల్ విద్య అమలు వంటి వాటిని అభివృద్ధి చేయాలని ప్రకటించింది. మొదటిదశలో రూ.7,289.54 కోట్లలో రూ.3,497.62 కోట్లు ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఖర్చు చేయాలని నిర్ణయించింది. పరిపాలనా అనుమతులను జిల్లా కలెక్టర్లకు ఇస్తుంది. ఆర్థిక శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. సాంకేతిక అంశాలను ఐటీశాఖ పర్యవేక్షిస్తుంది. ఇంకోవైపు సర్కారు బడుల్లో 21 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో విద్యార్థులకు నాణ్యమైన బోధనలేక తీవ్రంగా నష్టపోతున్నా రు.విద్యావాలంటీర్లను సైతం ప్రభుత్వం నియమించలే దు.ఇప్పుడు కరోనా నెపంతో ఈనెల 30 వరకు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులను పొడిగించింది. అటు మౌలిక వసతుల్లేక, ఇటు ఉపాధ్యాయుల్లేక, విద్యావాలంటీర్లు లేక విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయి.
భవనాలకు రంగులేయడమే కాదు... : చావ రవి, ప్రధాన కార్యదర్శి, టీఎస్‌యూటీఎఫ్
పాఠశాలల బలోపేతం అంటే భవనాలకు రంగులు వేయడం మాత్రమే కాదు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. బోధనేతర సిబ్బందితోపాటు పారిశుధ్య నిర్వహణకు పారిశుధ్య కార్మికులను నియమించాలి. విద్యార్థులందరికీ కంప్యూటర్‌విద్యను అందించాలి. పథకాలను ప్రకటించడమే కాకుండా ఆచరణలో అమలు చేయాలి. నిధులను నిర్దిష్ట కాలపరిమితిలోగా విడుదల చేయాలి. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందన్న నమ్మకం తల్లిదండ్రుల్లో కలిగించాలి. తెలుగు మాధ్యమంతోపాటు ఇంగ్లీష్ మీడియాన్ని సమాంతరంగా అమలు చేయాలి.
ఇదైనా సఫలీకృతం కావాలి : జి సదానందంగౌడ్, రాష్ట్ర అధ్యక్షులు, ఎస్టీయూటీఎస్
కామన్ స్కూల్ పోయింది, కేజీ టు పీజీ పోయింది. రూ.నాలుగు వేల కోట్లతో బృహత్తర విద్యాపథకం అమలు కాలేదు. చివరికి మన ఊరు-మనబడి కార్యమ్రం వచ్చింది. అయితే ఇది సఫలీకృతం కావాలన్న ఆకాంక్ష ఉన్నది. నిర్దిష్ట కాలపరిమితిలోగా బడులను బలోపేతం చేయాలి. మౌలిక వసతులను కల్పించాలి. అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేయాలి.