Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొట్టు...బోనాలు....
డప్పుదర్వు మేలాలు...
తొట్టెల బండ్ల ఊరేగింపులు....
పోషమ్మ, పోల్కమ్మ, పోతరాజు వంటి గ్రామ దేవతల్ని కొలిచేందుకు పల్లె జనం పాటించే ఆచారాలు....
కానీ ఇక్కడ దీపంతల వెలుగులు...
అగరొత్తుల పొగలు...
అందరికీ నైవేద్యాలు....
ఏటా పొలంపల్లి పొలిమేరల్లో కనువిందుగా కనిపించే కోలాహలం.
రెండూ దాదాపు ఒక్కటే. సంప్రదాయ పద్ధతుల్లో పెద్దగా తేడాలే లేవు. సాధారణంగా... ఏ దిక్కూ లేనోడికి దేవుడే దిక్కని నమ్మే జనాలు శతాబ్దాలుగా కొనసాగిస్తున్న ఆచారం మొదటిదైతే... ఏ అండాలేని పేదోడికి అన్నీ తానే అయ్యాడనే గౌరవంతో ప్రజలు ఆరు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న కోలాహాలం రెండోది.
దేవుడికి సరే! దీపరూప నైవేద్యాలు, హారతులు, అన్నీ అంతటా సర్వ సాధారణమే.
కానీ ఓ వ్యక్తికి.. కొబ్బరి కాయల మొక్కులు, దండల తోరణాలు అంతకు మించి పోరు జెండాలలో జేజేలు...
ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న మెదక్ జిల్లా చేగుంట మండలం పోలెపల్లిలో కనిపించే అరుదైన దృశ్యమిది. ఎందుకు? ఓ మనిషికి దైవత్వం ఆపాదించేటంతటి ఆదరణ... ఎందుకు? ఎందుకు...? ఎందుకంటే... అంతటి కీర్తి సొంతం చేసుకున్న అతడు కేవలం ఓ మనిషి మాత్రమే కాదు. అందరి ప్రేమాభిమానాలకు పాత్రుడైన అమరవీరుడు పోరు ధీరుడు 'కేవల్ కిషన్' 1920 మే 10న మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం తురకల మందాపూర్‌లో జన్మించిన కేవల్ కిషన్‌కు విద్యార్థి దశనుంచే అభ్యుదయ భావాలు అలవడ్డాయి. 1941లో ప్రజా ఉద్యమాల ప్రయోగశాల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పట్టా పోందిన కేవల్... అక్కడ జ్ఞానంతో పాటు సమాజంలోని అంతరాలు, అన్యాయాల్ని చక్కగా అర్థం చేసుకున్నాడు. నాటి సామాజిక పరిస్థితులూ తనపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. నిజాం, రజాకార్ల పాలనపై విసుగెత్తిపోయిన కాలమది. వెట్టి చాకిరీ, దౌర్జన్యాలు, దోపిడీ నిర్భందాల్ని చిన్న తనంలోనే చూసిన కేవల్ బీదలకు అండగా, భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగే పోరాటాల్లో తన ఉన్నత విద్య పూర్తయ్యాక మరింత చురుకుగా పాల్గొనడం ప్రారంభించాడు. ప్రధానంగా నాటి అణచివేత, అంటరానితనం వంటి వివక్షల్ని అసహ్యించుకున్నాడు. మత్స్యకార కుటుంబంలో పుట్టడం, ఆ రోజుల్లోనే తండ్రి మెదక్ పట్టణ తహసీల్థారుగా పని చేయడం వల్ల నాటి పాలన తీరు, నిర్భందాలు, సామాజిక అంతరాల్ని ప్రత్యక్షంగా చూసి వ్యతిరేకించాడు. అట్టడుగు జనానికి అండగా నిలిచేందుకు నిర్ణయించుకున్నాడు.
వెట్టి చాకిరీ, విపరీతమైన పన్నులు, బానిస బతుకుల విధానాన్ని వ్యతిరేకిస్తూ మాతృభాషలో విద్య, సాంస్కృతిక వికాసం కోసం ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జనం సంఘటితమవుతుండగా మెదక్ ప్రాంత ప్రజల ఉద్యమదారిగా మారాడు కేవల్ కిషన్. డాక్టర్ సరోజినినాయుడు కుమారుడైన డా|| ఎం.ఎన్ జయసూర్య, కవి మగ్దూం మోహియుద్దీన్ నేతృత్వంలో జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభÛంకాగా... జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు కేవల్ కిషన్. భూపోరాల్ని విస్తృతం చేశాడు. ముఖ్యంగా పాతూరు, కాట్రియల్, అక్కనపేట, మాసాయిపేట ప్రాంతాల్లో వేలాది ఎకరాల్ని పేదలకు పంచి శాశ్వత హక్కులు దక్కేలా చేశాడు.
ప్రధానంగా అవేలి ఘనపురం మండలంలోని జక్కన్నపేటలో సర్థన కిషన్ దొర నేతృత్వంలో భూస్వాములు... తమ భూమిలో సాగుకు వీలుగా గ్రామ చెరువు భూమిని ఆక్రమించి పంటలు వేసుకునేలా... ఏటా చెరువుకు గండి కొట్టేవారు. చెరువు కిందవైపువున్న తమ భూములకు నీరులేక ప్రజలు పడే కష్టాలు చూసి, వారికి అండగా గండికి అడ్డుగా నిలిచాడు. దొరల అండతో అక్కడి కొచ్చిన నిజాంసైన్యం తుపాకులు ఎక్కుపెట్టినా అందరక బెదరక సంఘం అండతో పోరు చేసి విజయం సాధించాడు. అందుకే నేటికీ ఆ గ్రామంలో కేవల్ కిషన్‌పై 'జాతర'రూపంలో ప్రజల ప్రేమ, ఆరాధన కనిపిస్తుంది. మరో చోట పేదల ఇండ్లు మునగకుండా చెరువుకు గండి కొట్టించి ప్రజల ప్రాణాలు కాపాడాడు.
కేవలం భూపోరాటాలేగాక, జీవితాల్లో మార్పు కోసం జీతగాళ్ల పోరాటం, వ్యవసాయ కూలీల కూలిరేట్ల పెంపు ఉద్యమం, సమానత్వం కోసం సమరం సాగించాడు.
దొడ్డి కొమరయ్య బలిదానం తర్వాత తెలంగాణలో ఊరూరా పోరు సాయుధ సమరంగా మారి దళాలు ఏర్పడగా... వారితో రహస్య సంబంధాలు సాగిస్తూ ఉద్యమం నడిపాడు కిషన్.
నల్గొండ జిల్లా పోచంపల్లి నుంచి మొదలైన భూధాన ఉద్యమ స్ఫూర్తిని చాటేందుకు మెదక్ పట్టణంలోని దుబ్బతోటలో ఉన్న తమ 120 ఎకరాల సొంత భూమిని నిరుపేదలకు పంచాడు. నేటికీ ఆ బస్తీని 'కిషన్ బస్తీగానే' పిలుస్తారు. ఇక రైతులు, గ్రామాలకు ఉపయోగపడేలా... మెదక్‌కు ప్రత్యేక విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేయాలని సిద్ధిపేట నుంచి మెదక్ వరకు పాదయాత్ర నిర్వహించాడు. మెదక్ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతూ... పసులేటి వాగు మంజీరనదిలో కలిసే చోట బోరు బావులకై ఉద్యమించాడు. ఆయన కృషి, మెదక్ జిల్లా మున్సిపల్ చైర్మన్‌గా తల్లి అండతో ఈ రెండు సమస్యల్ని శాశ్వతంగా అధిగమించారు. నెహ్రూ సర్కారు చేపట్టిన సైనిక చర్య, ఆ తర్వాత కమ్యూనిస్టులు సాయుధ పోరు విరమించాక 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో పీడీఎఫ్ తరుఫున ఎమ్మేల్యేగా పోటీ చేసిన కేవల్ కిషన్ కేవలం 900 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్‌రావు చేతిలో ఓడిపోయారు. 1957లోనూ 200 తేడాతో ఓడినా ప్రజా పోరాటాల బాటను వీడలేదు. సూర్యునికంటే ముందే నిద్రలేని జనం కష్టాలు తీర్చేందుకు వాళ్లలో ఒకడిగా మారే కిషన్ పేద ఇండ్లలో 'గంజినీళ్ళున్నా...., కారం మెతుకులున్నా... జొన్న రొట్టెలైనా, గటుక, గాసమైనా..'' పట్టింపు లేకుండా కడుపునింపుకునేవాడు. వారి కన్నీళ్ళు తుడిచేందుకు సదాసిద్ధంగా ఉండేవాడు. కేవల్‌కు ప్రజల్లో పెరిగిన ఆదరణ చూసి ఓర్వలేని భూస్వామ్య శక్తులే ఆయాన చావుకు కారణమనే బలమైన అనుమానాలు నేటికీ ఉన్నాయి.
1960 డిసెంబర్ 26న మాసాయిపేటకు స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళ్ళి మోటార్‌సైకిల్‌పై తిరిగి వస్తుండగా .. రాత్రి 11.30 నిమిషాలకు పొలంపల్లి గేటు వద్ద ముత్తాయిపల్లి భూస్వామి నర్సిరెడ్డి లారీ వెనకనుంచి ఢ కొట్టడంతో కిషన్ కన్నుమూశారు. అతనితో పాటు గాయపడ్డ మిత్రుడు సాలె లక్ష్మయ్యకు సరైన చికిత్స లభించక చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన లారీ నడిపిన డ్రైవర్ బొంగర బాలయ్య జైలుశిక్ష నుంచి వచ్చాక ఆత్మహత్య చేసుకోవడం కేవల్ మృతిపై అనుమానాల్ని మరింత పెంచాయి. ఆ తర్వాత ఆయన భార్య ఆనందాదేవి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో మెప్పుపొందగా.. వివిధ వృత్తుల్లో స్థిరపడ్డ ఆయన పిల్లలూ సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతున్నారు. మరణంతో అందరి భౌతిక కాయం మట్టిలో కలవడం ఖాయం. నెలలు గడిస్తే జ్ఞాపకాలు చెరగడమూ ఖాయం... కానీ.... రేపటి పొద్దులా జన యుద్ధంలో ప్రజల మదిలో.. భవిష్యత్తు వెలుగై నిలిచేది కొందరే. అలాంటి వారిలోనూ దేవుడి స్థాయి అమరత్వం పొందిన వీరులు అతి కొద్ది మందే. ఆయన చనిపోయాక మెతుకుసీమలో వేలాది మంది తమ పిల్లలకు 'కిషన్ కిషనమ్మ' అని పేరు పెట్టుకున్నారనంటేనే తనపై వారి ప్రేమ ఎంతటిదో అర్థమవుతుంది.
వీర తెలంగాణ నేలపై ... గిరిజన పోరాట యోధులు సమ్మక్క, సారక్క తర్వాత.. కేవలం.. కేవల్ కిషన్‌కే అంతటి గౌరవం దక్కిందేమో.
అందుకే...
ఎదలో ముద్దుల కొండా.. ఎర్రని మల్లెల దండా కేవల్ కిషన్..
పేదోళ్ళ కళ్ళనిండా మెరిసే పోరాట ముద్రగా... రేపటి తొలి పొద్దుగా ''పొలంపల్లి'' ప్రస్థానం.. అయింది చరిత్రలో సుస్థిరం... నేనువెళ్లిన వేళ.. నేను రాసిన ' పల్లె పల్లె ఎగరాలి ఎర్రజెండా పాట పోరు జాతరలో మార్మోగడం నాకు మరింత ఆనందం!.
- అనంగారి భాస్కర్ ,9010502255