Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా కమిషన్ తొలి వార్షికోత్సవంలో మంత్రి సత్యవతి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మహిళలను మహారాణులుగా చెలామణి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దానికోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అనేక భద్రతా చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి వార్షికోత్సవం బుధవారంనాడిక్కడి బుద్ధభవన్లోని కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. దీనికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరై, విలేకరులతో మాట్లాడారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందనీ, దానిలోభాగంగానే షీటీమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కుటుంబ సంబంధాలు, సహజీవనం, ప్రేమించి మోసం చేయడం వంటి అనేక రుగ్మతలు సమాజంలో ఉన్నాయని చెప్పారు. అలాంటి ఘటనల్లో అన్యాయం జరిగితే మహిళల పక్షాన కమిషన్ నిలుస్తుందని వివరించారు. కమిషన్ దృష్టికి వచ్చిన కేసులు పరిష్కారమవుతాయనే విశ్వాసాన్ని బాధితుల్లో కల్పించాలని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించిందీ వివరించారు. అనంతరం దివ్యాంగ గాయకుడు ధనుంజరు రాసి, స్వయంగా పాడిన 'మహిళా...ఓ మహిళా' అనే పాటల సీడీనీ, నూతన సంవత్సర కేలండర్నూ మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులు షాహీన్ అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరిబాయి, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుధాలక్ష్మి, కటారి రేవతి పాల్గొన్నారు.