Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఐఏ నిరసనలో నేతల డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వేతన సవరణను వెంటనే చేపట్టాలంటూ సాధారణ బీమా ఉద్యోగులు నిరసన తెలిపారు.ఈ అంశంపై హామీనిచ్చి 54 నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వంగానీ, యాజమాన్యంగానీ స్పందించడం లేదని విమర్శించారు. అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఏఐఐఈఏ) పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ... బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ యునైటెడ్ ఇండియా రీజనల్ కార్యాలయంవద్ద 'ఒక గంట'పాటు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నేషనల్, న్యూఇండియా, ఓరియంటల్, యునైటెడ్ ఇండియా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఐఈఏ ఉపాధ్యక్షులు కెవివిఎస్ఎన్ రాజు, జీఐఈఏ సౌత్‌జోన్ ఉపాధ్యక్షురాలు ఎన్ఎస్ శైలజా, హెచ్ఆర్జీఐఈఏ ప్రధాన కార్యదర్శి వై సుబ్బారావు మాట్లాడుతూ వేతన సవరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్పీఎస్ రద్దు చేసి ఉద్యోగులందరినీ 1995 పెన్షన్ స్కీమ్‌లోకి తీసుకురావాలనీ, కనీసం 30 శాతం 'ఫ్యామిలీ పెన్షన్' ఇవ్వాలని కోరారు. సాధారణ బీమా కంపెనీలను ప్రయివేటీకరించే ప్రయత్నాలు మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే వేతన సవరణ సాధించుకోగలుగుతామని చెప్పారు. ఆందోళనల ద్వారా ఆయా కంపెనీల ప్రయివేటీకరణను అడ్డుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, యాజమాన్యం ఇప్పటికైనా మొండివైఖరి విడనాడి ఉద్యోగ సంఘాలతో చర్చించి వేతన సవరణ ఒప్పందం చేయాలని కోరారు. లేదంటే ఈనెల 28న సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు.