Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేలకొండపల్లి
ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి బాలుడు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు సతీష్, రోజా దంపతులకు చందు అనే ఏడాదిన్నర బాలుడు ఉన్నాడు. వారిరువురూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజులాగే భర్త సతీష్ పొలం పనికి వెళ్లగా భార్య రోజా బాబుతో పాటు ఇంటి వద్దే ఉన్నారు. తమ కుమారుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా తల్లి ఇంటి పనుల్లో నిమగమయింది. ఆడుకుంటున్న క్రమంలో బాబు ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడిపోయాడు. అనంతరం బాబు కనిపించకపోవడంతో తల్లి చుట్టుపక్కల వెతికింది. అయినా కనిపించకపోవడంతో చివరకు నీటి సంపు వైపు చూసింది. నీటి సంపులో బాబు పైకి తేలుతూ కనిపించడంతో తల్లి బోరున విలపించింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చందూని బయటకు తీశారు. అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హుటాహుటిన నేలకొండపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాబు పరిస్థితిని పరీక్షించిన వైద్యులు అప్పటికే బాబు మృతి చెందినట్టు నిర్ధారించారు. దాంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.