Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందని మిషన్ భగీరథ నీరు
నవతెలంగాణ-మిర్యాలగూడ
మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని పదో వార్డు రవీంద్రనగర్ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ (ఎం) టూ టౌన్ కార్యదర్శి బవాండ్ల పాండు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవీంద్రనగర్ కాలనీలో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలనీలోని నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి ఇంటి బజారులో సుమారు 50ఇండ్లకు పైగా మంచి నీళ్లు రావడం లేదన్నారు. అదేవిధంగా కాలువ కట్ట వద్ద ఉన్న వంద కుటుంబాలకు పైగా నీరు అందడం లేదని తెలిపారు. ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా పేదలు నివసించే ప్రాంతాల్లో భగీరథ నీళ్లు లేవన్నారు. ఏడాది కాలంగా మంచినీటి కోసం పేద ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. భగీరథ పైప్‌లైన్ వేసినప్పటికీ మెయిన్ వాల్వ్ బిగించుకపోవడం, ఇండ్లలో నల్లా కలెక్షన్ ఇవ్వకపోవడంతో నీరు అందడం లేదన్నారు. తక్షణమే ప్రజలకు మంచి నీరు అందేలా చూడాలని, లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు నంద్యాల వేణుధరరెడ్డి, గుట్కా సుబ్బయ్య, జానయ్య, కమలమ్మ, నాగరాజు, నర్సయ్య, మహిళలు పాల్గొన్నారు.