Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై గళమెత్తుతాం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- కామ్రేడ్ పోలే నర్మింహ 20వ వర్ధంతి సభ
- స్థూపం ఆవిష్కరించిన తమ్మినేని
నవతెలంగాణ-యాచారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాలుచి పడి పేద ప్రజలపై భారాలు మోపుతున్నారనీ, వారి విధానాలపై రాబోయే రోజుల్లో గళమేత్తుతామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో కామ్రేడ్ పోలే నర్సింహ 20వ వర్ధంతి సందర్భంగా నిర్మించిన ఆయన స్థూపాన్ని తమ్మినేని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పేదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భారాన్ని మోపుతున్నాయన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో కాలమెల్లదీస్తుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80వేల కోట్లు ఖర్చు చేసిందని, మిగతా జిల్లాల్లో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనకుండా చేతులేత్తిసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా యావత్ రైతులంతా ఐక్యంగా పోరాడి ఆ చట్టాలను వెనక్కి తీసుకునేలా చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మధుసూదన్ రెడ్డి, పగడాల యాదయ్య, అలంపల్లి నర్సింహ, పెండ్యాల బ్రహ్మయ్య, నానక్‌నగర్ సర్పంచ్ పెద్దయ్య, అలంపల్లి జంగయ్య, చందు నాయక్, కొత్తపల్లి ఉప సర్పంచ్ కావలి జగన్, విప్లవ కుమార్, సీపీఐ(ఎం) శ్రేణులు, గ్రామస్తులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.