Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకటి నుంచి పదో తరగతి వరకు సమాంతరంగా ప్రారంభం
- ఆంగ్ల మాధ్యమం కోసమే టీచర్ల భర్తీ
- ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం ఉంటుంది
- కొత్తచట్టంతోనే ఫీజులకు నియంత్రణ
- 'మన ఊరు మనబడి'కి అందరూ సహకరించండి
- మహిళా వర్సిటీని మంజూరుచేసిన సీఎంకు కృతజ్ఞతలు: ఇష్టాగోష్టిలో మంత్రి సబితా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఇంగ్లీష్ మీడియం లేకుంటే భవిష్యత్తు లేదు. విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి. అది జరగాలంటే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలి. ఆ మీడియంలో చదివేందుకే ప్రయివేటు పాఠశాలలకు విద్యార్థులు వెళ్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇది గొప్ప నిర్ణయం. సర్కారు బడుల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంను సమాంతరంగా అమలు చేస్తాం.'అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆమె విలేకర్లతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. 'కరోనా సమయంలో చాలా మంది తల్లిదండ్రులు నా వద్దకు వచ్చేవారు. ప్రయివేటు స్కూళ్లలో ఫీజులు తగ్గించాలని కోరేవారు. మీకు దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ఉచిత విద్య అందుతుంది కదా అన్నాను. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం ఉండదు కదా?అని వారు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పది నుంచి 20 కిలోమీటర్ల వరకు బస్సుల్లో పంపించి ప్రయివేటు స్కూళ్లలో పిల్లలను చదివిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రారంభిస్తున్నాం'అని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం సెక్షన్‌ను ప్రారంభిస్తామని అన్నారు. కరోనా కారణంగా ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులను చెల్లించలేక సర్కారు బడుల్లో మూడు లక్షల మంది విద్యార్థులు పెరిగారని వివరించారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడితే విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 10 లక్షల మంది ఇంగ్లీష్ మీడియం, 12 లక్షల మంది విద్యార్థులు తెలుగు మీడియంలో చదువుతున్నారని వివరించారు. ఇంగ్లీష్ మీడియంలో బోధించడం కోసమే ఉపాధ్యాయులను భర్తీ చేస్తామన్నారు. ఉపాధ్యాయ ఖాళీలను, అవసరాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. ప్రస్తుతం 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వివరించారు. వారిలో 1,350 మందికి అజీంప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఆంగ్లంపై శిక్షణనిచ్చిందని గుర్తు చేశారు. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం నియమించిన తిరుపతిరావు కమిటీ సైతం చట్టం తేవాలని సూచించిందని వివరించారు. ఫీజులను నియంత్రించాలని వైఎస్ హయాం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, జీవో ఇస్తే ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి స్టే తెస్తున్నాయని చెప్పారు. చట్టం వస్తేనే ఫీజులను నియంత్రించడం వీలవుతుందన్నారు.
'మన ఊరు మనబడి'లో అందరూ భాగస్వాములు కావాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన ఊరు-మనబడి' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. పూర్వ విద్యార్థులు, విద్యపట్ల ఆసక్తి ఉన్న వారు అమెరికా సహా ఎక్కడున్నా పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని సూచించారు. సొంతంగా భవనాలు కట్టించిన వారి పేర్లను ఆ పాఠశాలలకు పెడతామని వివరించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబర్, ఈమెయిల్ఐడీ అందుబాటులోకి తెస్తామన్నారు. తొలివిడతలో 9,123 స్కూళ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. పనులకు సంబంధించి కొన్ని విద్యాకమిటీలు, గ్రామకమిటీలతోపాటు కలెక్టర్లు ఏజెన్సీలను ఎంపిక చేస్తారని వివరించారు. 15 రోజుల క్రితం నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. ఈనెలాఖరులోపు పనులు పూర్తవుతాయని అన్నారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మిస్తే కొంత సమయం పడుతుందని చెప్పారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు ప్రకటించారు. కోఠి మహిళా కాలేజీలో డిగ్రీ సీటు కోసం వరుసలో తాను గంటసేపు నిలబడ్డానని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కాలేజీని అభివృద్ధి చేసే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.
త్వరలోనే వర్సిటీ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అధ్యాపక పోస్టులను విశ్వవిద్యాలయాలు భర్తీ చేసేవని గుర్తు చేశారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ బోర్డు లేదా టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలా?అనే అంశంపై సీఎస్ వద్ద ప్రతిపాదనలున్నాయని వివరించారు. న్యాయపరంగా ఇబ్బందుల్లేకుండా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారని అన్నారు. త్వరలోనే సీఎస్‌తో సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు.