Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఎమ్ఏఎస్ఎమ్సీ' సొసైటీలో రూ.50కోట్లకుపైగా స్కామ్
- బోర్డు డైరెక్టర్లు, సలహాదారులు, ప్రధాన ఉద్యోగులే అసలు దొంగలు?!
- రెన్నెళ్లుగా బోర్డు తిప్పేసిన నిర్వాహకులు
- రోడ్డున పడిన 2వేల మంది ఉద్యోగులు, సిబ్బంది
- రోజువారీ కూలీలు మొదలు.. చిరు ఉద్యోగులే టార్గెట్
- సీఎం, మంత్రి కేటీఆర్ సొసైటీని కాపాడాలని చైర్మెన్ లేఖ
- డిపాజిటర్లకు సమాధానం చెప్పలేక ఉద్యోగి ఆత్మహత్య
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీలో పెద్దఎత్తున కుంభకోణం జరిగింది. డబ్బును బోర్డు డైరెక్టర్లు, ప్రధాన ఉద్యోగులే అందినకాడికి దోచుకున్నారు. కరోనా కాలంలో సొసైటీ నడవడిక సరిగా సాగకపోవడం, చైర్మెన్ సహా బోర్డు డైరెక్టర్ల మధ్య పొరపొచ్చాలు రావడం పర్యవసానంగా సొసైటీ నిర్వహణ చేజారిపోయింది. దీంతో అవకాశం ఉన్న కొందరు అందినకాడికి రూ.కోట్లలో కొల్లగొట్టారు. రెన్నెళ్ల కిందటే సొసైటీ బ్రాంచీలన్నీ 300వరకు మూతపడగా.. 2వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. డిపాజిటర్లు, సేవింగ్స్ చేసుకున్న ఖాతాదారులు సొసైటీ ఎగ్జిక్యూటీవ్‌లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో రూ.28లక్షల వరకు డిపాజిట్లు చేయించిన ఓ ట్రెయినీ అకౌంటెంట్ సొసైటీ బోర్డు తిప్పేసిన నేపథ్యంలో బాధితులకు సమాధానం చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సొసైటీ చైర్మెన్ తిప్పినేని రామదాసప్ప నాయుడు లేఖ రాస్తూ.. సంస్థకు చెందిన 16మంది బోర్డు డైరెక్టర్లు, ముగ్గురు న్యాయ సలహాదారులే అవినీతికి పాల్పడ్డారని పేర్కొనడం గమనార్హం. మూన్నెళ్లలో తిరిగి డిపాజిటర్లకు డబ్బులు చెల్లిస్తామని బహిరంగ ప్రకటన ఇచ్చారు. సెంట్రల్ కో - ఆపరేటీవ్ యాక్ట్ -2002 కింద 12 ఏప్రిల్ 2017న ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్ ఏర్పాటైంది. గ్రామీణ ఆర్థిక శక్తిని మెరుగుపర్చడమే లక్ష్యంగా వెనుకబడిన, అణగారిన ప్రజల జీవితాల్లో ఆర్థిక 'ముద్ర' వేస్తామన్న లక్ష్యాలతో ప్రజల్లోకి వచ్చింది. చిన్నమొత్తాల్లో రుణాలు తక్కువ వడ్డీకే ఇస్తూ నమ్మకాన్ని చూరగొన్నది. రూ.లక్ష నుంచి రూ.4లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్లను తీసుకుని.. నెలవారీ వేతనాల కింద సొసైటీలో 2వేల మంది ఉద్యోగులను ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 300 బ్రాంచీల్లో నియమించుకుంది. ఉద్యోగుల చేత జనం నుంచి పెద్దఎత్తున సొమ్మును డిపాజిట్ల పేరుతో సొసైటీ ఖాతాల్లో జమ చేయించుకుంది. కొందరైతే రూ.లక్ష నుంచి రూ.5లక్షలవరకు డిపాజిట్లు చేశారు. ఇలా ఒక్కో బ్రాంచీలో పని చేస్తున్న 5 నుంచి ఆరుగురు ఉద్యోగులు తలా రూ.5లక్షల నుంచి రూ.10లక్షల చొప్పున కనీసంగా 30లక్షల వరకు ప్రజల సొమ్మును సొసైటీ ఖాతాల్లో జమ చేయించారు. కరీంనగర్ జిల్లాలోని ఒక్క రామడుగు బ్రాంచీలోనే 40లక్షలు సేకరించారంటే రెండు రాష్ట్రాల్లోని 300 బ్రాంచీల్లో రూ.100కోట్లకుపైగానే ఉంటుందనేది అంచనా.
చెప్పిన లక్ష్యం ఒకటి.. చేసిన ఘనత మరొకటి..
ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లాల్లో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి వచ్చిందని, శీతల గిడ్డంగులు సహా పలు గోదాముల నిర్మాణాలను ప్రారంభించుకుంటున్నామని పోస్టర్లు, ఇతర ప్రకటనలతో సొసైటీ ఊదరగొట్టింది. గ్రామీణ జీవితాలను శక్తివంతం చేసే దిశగా దేశీ కోళ్లఫామ్‌లు, పాడిపశువులు, మేకలు, గొర్రెలు, ఈము కోళ్ల పెంపకం, పూర్తి సేంద్రీయ కూరగాయల ఉత్పత్తి యూనిట్లను స్థాపిస్తున్నామని చెప్పింది. 'ముద్రలో పొదుపు.. మీ భవిష్యత్‌కు మలుపు' అన్న నినాదంతో 'రోజువారీగా, వారం వారీగా పొదుపు చేసుకుని మీకు మీరే పెట్టుబడిదారులుగా మారండి' అంటూ ప్రకటించింది. 'కరోనా కాలం నుంచి గట్టెక్కాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొచ్చాం' అంటూ డిపాజిట్లు, రోజువారీ, నెలవారీగా సేవింగ్స్‌ను వసూలు చేసే పనిలో పడింది. ఆ తర్వాత రెన్నెళ్ల కిందట వరకూ సంస్థ బ్రాంచీలు తెరుచుకునే ఉండగా.. నవంబర్ మొదటి వారం నుంచి ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. దీంతో డిపాజిటర్లు, ఖాతాదారులు సంస్థ ఉద్యోగుల చుట్టూ తిరుగుతున్నారు. విషయం తెలుసుకున్న కొందరు 'మిమ్మల్ని నమ్మి డబ్బులు జమ చేసుకున్నాం. అవి మీరే తిరిగి చెల్లించాలి' అంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు.
రూ.2లక్షల వరకు చెల్లించా..
నాకు వచ్చే ఆదాయం నుంచి ప్రతిరోజూ రూ.500 చొప్పున ఏడాదిపాటు సొసైటీలో జమ చేసుకున్నా. ప్రతి రోజూ జమ చేసుకునే నగదుపై వడ్డీ ఇస్తామని చెప్పారు. కానీ, రెన్నెళ్లుగా ఆఫీసు తాళాలే తీయడం లేదు. ఎవరూ రావడం లేదు. ఎవర్ని సంప్రదించాలో తెలియడం లేదు.
- ఆకుల లత, కరీంనగర్
సమాధానం చెప్పుకోలేక ఆత్మహత్య..
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్‌కు చెందిన ఎన్నం సాయికృష్ణ ఏడాదిన్నర కిందట ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటీవ్ సొసైటీలో చేరాడు. సంస్థ ఇస్తున్న రుణాలు, డిపాజిట్లపై వడ్డీ పట్ల నమ్మకం కలిగి తన సన్నిహితులు, బంధువులతో రూ.28లక్షల వరకు సేకరించి సొసైటీలో డిపాజిట్లు జమ చేశాడు. రెన్నెళ్ల కిందట ఆ సొసైటీ బోర్డు తిప్పేయడంతో డిపాజిటర్లు సాయికృష్ణపై ఒత్తిడి తెస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక, ఆ డబ్బులు ఇక తిరిగిన రావన్న ఆందోళన మధ్య ఈనెల 17న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.