Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభ్యత్వ సమన్వకర్తల సమావేశంలో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పార్టీని బలోపేతం చేసేందుకు మండలాలను ప్రాతిపదికగా తీసుకుని పని చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి కోరారు. ఒక్కో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పార్టీ బలంగా ఉంటే ఆ అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకుంటామనీ, 600 మండలాల్లో పార్టీ బలపడితే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని వివరించారు. ప్రతి ఒక్కరూ ఆ దిశగా పని చేయాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఆవరణలోని ఇందిరాభవన్‌లో సభ్యత్వం సమన్వయకర్తలతో ఆయన సమావేశమయ్యారు.మండలాల్లో అధ్యక్షులు సరిగా పని చేయకపోతే వారిపై చర్యలు తప్పవన్నారు. మండలాల్లో 10వేలు, నియోజకవర్గంలో 50 వేలు, పార్లమెంట్ నియోజక వర్గంలో 3.5 లక్షల సభ్యత్వాన్ని చేయించిన నాయకులకు రాహుల్‌గాంధీతో సన్మానం చేయిస్తానని హామీ ఇచ్చారు. గురువారం అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలతో సభ్యత్వంపై సమీక్షిస్తామని తెలిపారు.
కాంగ్రెస్‌లో చేరిన హర్షవర్ధన్‌రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ రాలేదనే కారణంగా కాంగ్రెస్‌ను వీడిన ఉపాధ్యాయ సంఘం నాయకుడు హర్షవర్ధన్‌రెడ్డి తిరిగి హస్తం పార్టీలో చేరారు. ఈమేరకు బుధవారం గాంధీభవన్‌లో ఆయనకు పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ పట్టబద్రుల ఎన్నికల్లో ఏఐసీసీ ఆదేశాలమేరకు చిన్నారెడ్డి పోటీ చేశారనీ, అప్పటికే పోటీలో ఉన్నా హర్షవర్ధన్‌రెడ్డి వద్దని వారించినా బరిలో నిలిచారని గుర్తు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో 317ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బడికి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్ ముట్టడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసి సీఎం కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మెన్ జి చిన్నారెడ్డి ఉన్నారు.
గాంధీభవన్‌లో కరోనా
కరోనా వ్యాప్తి నేపథ్యంలో గాంధీభవన్‌లో జాగ్రత్త చర్యలు చేపట్టారు. అన్ని గదులను గాంధీ భవన్ సిబ్బంది శానిటేషన్ చేశారు. నాలుగు రోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా కరోనా బారినపడ్డారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే దూద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీనియర్ నేత కోదండరెడ్డి, ఏఐసీసీ కార్యకలాపాల చైర్మెన్ ఏలేటి మహేశ్వర్రెడ్డికు కరోనా వచ్చిన సంగతితెలిసిందే. అంతకు ముందు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డికి కరోనా సోకింది. గాంధీభవన్ వ్యవహారాలు చూసే పలువురు మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.