Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరితనిధికి తన వంతుగా సహకారం : రామయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హరితనిధికి సహకారం అందించడంలో భాగంగా తాను స్వయంగా పెంచిన 20 టన్నుల ఎర్రచందనం చెట్లను అటవీశాఖకు ఇస్తున్నట్టు పద్మశ్రీ వనజీవి రామయ్య ప్రకటించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చాలా మంచిదని ప్రశంసించారు. పర్యావరణ రక్షణ కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు. పచ్చదనం పెంచడంలో భాగంగా ప్రతి బక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. అనేక దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ, వనాలు పెంచుతూ వనజీవిగా పద్మశ్రీ అందుకున్న రామయ్య బుధవారం ప్రగతి భవన్లో రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ను కలిశారు. తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితనిధి కార్యక్రమాలపై చర్చించారు. దేశమంతా పచ్చబడాలనే హరిత సంకల్పంతో మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అత్యంత విజయవంతం కావాలని ఆకాం క్షించారు. ప్రకృతి దీవెనలు ఉండాలని ఎంపీ సంతోష్ కుమార్ను రామయ్య దంపతులు ఆశీర్వదించారు. ఏడు పదుల వయస్సులోనూ నిత్య ఉత్సాహంతో పర్యావరణ రక్షణ కోసం పాటుపడుతున్న రామయ్య దంపతులను కలవటం ఆనందంగా ఉందని సంతోష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా రామయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఎలాంటి వైద్యం కావాలన్నా తనను సంప్రదించాలనీ, తానే బాధ్యత తీసుకుంటానని హామీనిచ్చారు. రామయ్య నాటేందుకు, పంపిణీకి అవసరమైన మొక్కలను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున అందించేందుకు సంసిద్ధత తెలిపారు.