Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వయోపరిమితి పెంపునకు సర్కారు నిరాకరణ
- ఉద్యోగుల కన్నా ముందే ఉద్యోగ విరమణ
- ఆందోళనలో వర్సిటీ అధ్యాపకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రొఫెసర్లకు ఉద్యోగ విరమణ వయోపరిమితిని పెంచేందుకు నిరాకరించింది. దీంతో రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల కన్నా ముందే ఉద్యోగ విరమణ పొందే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలోని ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయో పరిమితిని 58 నుంచి 61 ఏండ్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె రామకృష్ణారావు జీవో నెంబర్ 45ను 2021, మార్చి 30న విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ ఎంప్లారుమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్న్యుయేషన్) సవరణ చట్టం-2021 అమలుకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణలు మార్చి నుంచి లేవు. అయితే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయోపరిమితి ఎంత?అనే చర్చ ఇంతకాలం సాగింది. ప్రస్తుతం వారి ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏండ్లు ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏండ్లకు పెంచింది. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది వయోపరిమితిని సైతం 58 నుంచి 61 ఏండ్లకు పొడిగించింది. అంటే మూడేండ్లు పెరిగింది. ఇంకోవైపు యూజీసీ నిబంధనల ప్రకారం కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏండ్లు అమల్లో ఉన్నది. దీని ప్రకారం విద్యాశాఖ అధికారులు మూడు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 61 ఏండ్లు పెంచాలని సూచించారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడేండ్లు పెంచినందున ప్రొఫెసర్లకు సైతం ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 63 ఏండ్లకు పెంచాలని కోరారు. ఇక యూజీసీ ప్రకారమైతే 65 ఏండ్లు ఉండాలని ప్రతిపాదించారు. ఈ మూడు ప్రతిపాదనలనూ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరస్కరించినట్టు సమాచారం. దీంతో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు ఆందోళనలో ఉన్నారు. 2021, మార్చి నుంచి రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణల్లేవు. కానీ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణలు ప్రతినెలా ఉండడం గమనార్హం.