Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం
- నేడు ఉత్తర్వులు వచ్చే అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర, స్పౌజ్ (భార్యాభర్తలు) బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన అప్పీళ్లను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అంగీకరించినట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. దీంతో గురువారం పరస్పర, స్పౌజ్ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశమున్నది. 317 జీవోకు అనుగుణంగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజనను ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే భార్య ఒక జిల్లా, భర్త ఒక జిల్లాకు కేటాయించడంతో కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగుల విభజనను ప్రభుత్వం చేపట్టింది. దీంతో స్థానికతను కోల్పోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు సుదూర ప్రాంతాలకు, స్థానికేతరులుగా ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. వితంతువులు, ఒంటరి మహిళలను వారి స్థానికత ఉన్న జిల్లాలోనే కేటాయించాలి. కానీ ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. దీనిపై తీవ్రస్థాయిలో నిరసనలు వచ్చాయి. సంక్రాంతి పండుగ రోజు సైతం ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. 'నాన్న ఒక జిల్లా , అమ్మ ఒక జిల్లా, మేము ఏ జిల్లా'అంటూ పిల్లలు వేడుకున్న సంఘటనలున్నాయి. మంత్రివర్గ సమావేశంలో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయుల పరస్పర, స్పౌజ్ బదిలీలకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ అంశాలన్నింటిపై సీఎం దృష్టి సారించారు. పరస్పర, స్పౌజ్ బదిలీలు చేపట్టాలని సీఎస్‌ను ఆదేశించినట్టు సమాచారం.
సీఎంకు పీఆర్టీయూటీఎస్ కృతజ్ఞతలు
పరస్పర, స్పౌజ్ బదిలీలతోపాటు ఇతర అప్పీళ్లను పరిష్కరించేందుకు గ్రీన్‌సిగల్ ఇచ్చిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంలో ఉపాధ్యాయుల జిల్లా, జోనల్, మల్టీ జోనల్ సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.
పరస్పర, స్పౌజ్ బదిలీలు చేపట్టాలి : సీఎస్‌కు టీఎన్జీవో వినతి
రాష్ట్రంలో ఉద్యోగులకు పరస్పర, స్పౌజ్ బదిలీలు చేపట్టాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌ను బుధవారం బీఆర్కే భవన్లో వారు కలిసి వినతిపత్రం సమర్పించారు. 317 జీవోకు అనుగుణంగా పరస్పర, భార్యాభర్తల బదిలీలను చేపట్టాలని కోరారు. సీనియర్, జూనియర్ ఉద్యోగుల పేరుతో జరిగిన పొరపాట్లను సవరించాలని సూచించారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల విభజన ప్రక్రియలో పరస్పర, భార్యాభర్తల కేసులను వారి విజ్ఞప్తి మేరకు బదిలీలు చేయాలని కోరారు. ఉద్యోగుల అప్పీళ్లను పరిష్కరించాలని సూచించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉత్తర్వులు విడుదల చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగులకు మూడు డీఏలు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎస్‌ను కలిసిన వారిలో టీఎన్జీవో కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, హైదరాబాద్ అధ్యక్షులు ముజీబ్, నల్లగొండ జిల్లా అధ్యక్షులు శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.