Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక కోడ్స్‌ను రద్దు చేయాలి : రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి
- రైల్వేస్టేషన్ వద్ద నిరసన
నవతెలంగాణ- మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను వీడాలని, కార్మిక కోడ్స్‌ను రద్దు చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధ వారం సీఐటీయూ, ఏఐకేఎస్, రైతు సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద హమాలీలు నిరసనతెలిపారు. ఈసందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నాయన్నారు. కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ సంస్థలను అప్పగించి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టడంతోపాటు కార్మికులను రోడ్డుపై పడేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కార్మికులకు కనీస ఉపాధి దొరకకుండా చేసే విధంగా కొత్త చట్టాలు తీసుకొస్తున్నారని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన కార్మిక కోడ్స్‌ను రద్దు చేసే వరకు పోరాటం నిర్వహించాలని కోరారు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని, రైల్వే ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బీకార్ మల్లేశ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీర్లపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు డాక్టర్ గౌతమ్ రెడ్డి, రవి నాయక్, మంగారెడ్డి, బవాండ్ల పాండు, నంద్యాల వేణుధరరెడ్డి, బాబు నాయక్, రెడ్యా నాయక్, పాతని శ్రీనివాస్, బాధ్యనాయక్, భాగ్య నాయక్ పాల్గొన్నారు.