Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 లక్షల మందిలో కరోనా లక్షణాలు
- వైద్యారోగ్యశాఖ ఫీవర్ సర్వేలో వెల్లడి
- జాగ్రత్తలు పాటించాలంటున్న డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఊహించినట్టుగానే తెలంగాణలో ఒమిక్రాన్, వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 20లక్షల మందిలో జ్వరం లక్షణాలు కనిపించాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ చేపట్టిన ఫీవర్ సర్వేలో ఈవిషయాలు వెల్లడయ్యాయి. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం లు, ఆశావర్కర్లు, అంగన్ వాడీలతో అధికారులు సర్వే చేయిస్తు న్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జ్వరపీడితుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఏ మాత్రం అనుమాన మున్న వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. వ్యాధిని ప్రభుత్వం నిర్దారించగలిగితే అంతే త్వరగా కచ్చితమైన చికిత్స చేసేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను కట్టడి చేసేందుకు వీలుగా డిసెంబర్ ఒకటి నుంచి దేశంలో పలు రకాల చర్యలు చేపట్టిన సంగతి తెలి సిందే. అదే నెల రెండో వారం నుంచి రాష్ట్రంలో ఫీవర్ సర్వేను చేపట్టారు. దాదాపు నెల రోజుల నుంచి ఈ సర్వేను నిర్వహిస్తు న్నారు. జ్వరానికి సంబంధించిన రోగులను గుర్తించేందుకు ప్రయత్నించారు. అనూహ్యంగా ఆ సంఖ్య 20 లక్షలకు చేరింది. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షల మంది వరకు బాధితులుండగా, ఇతర జిల్లాల్లో ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది వరకున్నారు. జనవరి ఒకటి నుంచి 17 రోజుల వ్యవధిలో 20 లక్షల మందికి హౌం ఐసో లేషన్ కిట్లు సరఫరా చేశారు. మరో 15లక్షల మందికి సరిపడా హౌంఐసోలేషన్ కిట్లను హెల్త్ స్టోరేజ్ సెంటర్లో అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. కరోనా సెకెండ్ వేవ్ సమయంలో కిట్లను ఉపయోగిం చడం ద్వారా తీవ్రతను తగ్గించగలిగామని చెబుతున్నారు. అయితే జ్వరం వచ్చిన వారితో పాటు ముందుజాగ్రత్తగా పాజిటివ్ వచ్చిన వారికి కాంటాక్ట్ అయిన వారికి కూడా అందజేసినట్టు తెలిపారు. వీరందరికి కరోనా సోకినట్టుగా భావించలేమని అధికారులు స్పష్టం చేశారు. అదే సమయంలో ఒమిక్రాన్ వ్యాప్తి వేగాన్ని తక్కువగా అం చనా వేయలేమని అభిప్రాయం వ్యక్తం చేశారు.. గత నెల రోజులుగా ఆ వేరి యంట్ కేసులు గ్రేటర్లో వందల్లోచి వేలకు చేరుకున్నాయి. ఇటీవల రాష్ట్రమంతా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రెండు వారాలు మరింత ప్రమాదకరమనీ, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
గాలిలో ఎక్కువ కాలం....
ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉండటానికి ఆ వేరియంట్ రకం కరోనా గాలిలో ఎక్కువ కాలం మనగలగడమేనని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దనీ, ముఖ్యంగా వయస్సు పైబడిన వారు, ఇతర వ్యాధులు కలిగిన వారి పట్ల ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని గుర్తుచేస్తున్నారు.
27 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రంలో కొత్తగా 3,557 మందికి కరోనా సోకింది. ముగ్గురు మరణించారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 1,11,178 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 11,949 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 24,253 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 1,474 మందికి కరోనా సోకింది. రంగారెడ్డిలో 275, మేడ్చల్ - మల్కాజిగిరిలో 321, ఖమ్మంలో 104, హన్మకొండలో 130 మంది వ్యాధి బారిన పడ్డారు. కాగా మంగళవారంతో పోలిస్తే బుధవారం జీహెచ్ఎంసీతో సహా 27 జిల్లాల్లో కేసులు పెరిగాయి. పాజిటివ్ రేటు 3.19 శాతంగా నమోదయింది.