Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చుట్టూరా దట్టంగా పొగ....
దారి దొరకక తడబడ్డ అడుగులు...
దిక్కులన్నీ పిక్కటిల్లేలా అహాకారాలు...
మంటకు ఆగలేక టపటపటప రాలుతున్న కన్నీళ్ళు ఇటువైపు...
చూస్తుండగానే ఎర్రబారిన కళ్లు.... పటపటమని కొరుకుతున్న పళ్లు....
గంటకోరీతిన పెరుగుతున్న బలలు...
గుర్రాల మీద జనంపై దాడికి సిద్ధంగా ఉన్న బలగాలు అటువైపు...అంతేనా... వడగళ్ల వానై పైన బడుతున్న కంకరరాళ్ళు, లాఠీలు ఘళిపిస్తూ పేదలపై ప్రతాపం చూపుతున్న పోలీసులు... అడుగు పెడితే చాలు రేగుముళ్లై పట్టి చీల్చే ఇనుప ముళ్ళకంచెలు...అదొక రణరంగం...!
అయినా అదరని జనం... తాడోపేడో తేల్చుకునే మొండితనం... ''తగ్గించాలే పెంచిన విద్యుత్ చార్జీలు'' అంటూ గర్జిస్తున్నరు జనం గొంతులు... ఉద్యమ కేతనమై చేతుల్లో ఎగురుతున్నరు ఎర్రజెండాలు...
అడ్డుకోకుంటే అహందెబ్బతింటది. ''ప్రపంచబ్యాంకుతో చేసుకున్న చీకటి ఒప్పందాలు డేంజర్లో పడతరు''... అనుకుని ముందస్తు వ్యూహంతో సిద్ధంగా ఉన్న పాలకవర్గం తుది ఆదేశాలిచ్చింది. పోలీసు దళం నెత్తురు కండ్ల చూసేందుకు సిద్ధమైంది. అంతే ...ఒక్కసారిగా పేలిన తుపాకులు... ఆర్తనాదాలతో మార్మోగిన అక్కడి రోడ్లు, వీధులు...
ఇదీ....! 2000 సంవత్సరం ఆగస్టు 28న హైదరాబాద్‌లో అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న 'బషీర్‌బాగ్'లో కనిపించిన రణరంగ పర్వం... సరిగ్గా మరో జలియన్‌వాలాబాగ్ ఘటనను మన ముందు నిలిపిన నెత్తుటి దృశ్యం...! కాకుంటే రెండే తేడాలు... నాడు చుట్టూ ఉన్న ద్వారాలు మూసి కాల్చారు. నేడు బారీ బలగాలతో చుట్టుముట్టి తుపాకులు పేల్చారు. అప్పుడు కాల్చింది తెల్లదొరల సైన్యం, ఇప్పుడు ఆ పని చేసింది స్వయానా మనమెన్నుకున్న పాలక రాజ్యం.
చరిత్రలో నెత్తుటి ఘట్టంగా, విద్యుత్ పోరాటంగా నిలిచిన ఈ ఉద్యమం ప్రపంచబ్యాంకు పాలనా సంస్కరణలపై జనం తిరుగుబాటుకు అచ్చమైన నిదర్శనం.
అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హైటెక్ సర్కారు... ప్రజలపై పలు భారాలు మోపేందుకు సిద్ధమైంది. అప్పుల కోసం అర్థంలేని ఆర్థిక సంస్కరణల్ని అమలు చేసేందుకు పెట్టుబడిదారుల పెద్దన్న ప్రపంచ బ్యాంకుతో లోలోపలి ఒప్పందాలతో... రహస్య షరతులకు తలవంచి... బయటికి మాత్రం... గంగిరెద్దును అలంకరించి గంటకొట్టినట్టు, చిలకపలుకులు వల్లెవేసినట్టు... అభివృద్ధి మంత్రాలు చదివింది. ఈ క్రమంలోనే విద్యుత్ సంస్కరణల అమలుకు పూనుకున్న చంద్రబాబు సర్కారు... భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ అనాలోచిత చర్యపై భగ్గుమన్నది ఆంధ్రావని. కరువు కాటకాలు, మోయలేని పన్నులతో బతుకులన్నీ బాధల్లో మగ్గుతుంటే.... పేదలు అర్థాకలితో కాలం ఎల్లదీస్తుంటే...! వ్యవసాయానికి ఏ సాయం లేక అన్నదాతలు ఆగమై ఉంటే... బాబు సర్కారు పేల్చిన ఛార్జీల బాంబుతో పేదలందరికీ ఊపిరాడనట్లయింది.
ఈ సర్కారు తీరును తప్పు పట్టిన వామపక్షాలు... పెంచిన కరెంటు ఛార్జీలు ప్రతి ఇంట్లోనూ కన్నీటికి కారణమవుతాయని, వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాలన్నీ ఈ డిమాండ్‌కు మద్ధతు పలికాయి. అయినా తమ నిర్ణయంపై పునరాలోచించేందుకు సిద్ధపడలేదు పాలకులు. రోజులు గడిచే కొద్దీ ఈ నిర్ణయంపై జనాగ్రహం పెరుగుతోంది. ఊరూరున నిరసనల నిప్పంటుకుంటోంది. వామపక్షాలు రోడ్డెక్కినరు... వరుసగా నిరసన కార్యక్రమాలు ప్రకటించినరు... అసెంబ్లీ సమావేశాలు జరిగేవేళ ప్రజలు కష్టాన్ని చట్టసభ ముందుంచేందుకు వీలుగా 9 వామపక్షాల పార్టీలు కలిసి 'చలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చాయి. వామపక్ష పార్టీల శాసన సభ్యులతో పాటు, మద్ధతుగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ శాసనసభ్యులంతా పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరసన దీక్షకు దిగారు. నలువైపుల ఒత్తిడి పెరుగుతున్నా వెనక్కి తగ్గక, ప్రతిష్టకు పోయింది బాబు సర్కారు. ఎలాగైనా ఈ ఉద్యామాన్ని విచ్ఛిన్నం చేయాలని వ్యూహాలు పన్ని సిద్ధమైంది.
ఆగస్టు 28న పల్లెలు, పట్నాలు హైదరాబాద్ బాట పట్టాయి. నగరం చేరిన జనం ఇందిరా పార్క్ నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా బయలు దేరింది. వేలాదిగా బషీర్‌బాగ్‌కు చేరుకున్న ప్రజాదండు... విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నినదిస్తోంది. ముళ్ళకంచెలు, బారీకేడ్లు, వందలాది బలగాల్ని మోహరించి సిద్ధమైన పాలక పోలీస్ వర్గం... లాఠీలకు పని చెప్పింది. గుర్రాలతో గుంపును చెదరగొట్టింది. జనం చీమలదండోలె ఎర్ర జెండాలు పట్టి ముందుకొస్తుంటే.... నీటి ఫిరంగులతో నిలువునా తడిపేశారు. టియర్‌గ్యాస్ వదిలి పరుగులు పెట్టించారు. అయినా పట్టువీడని ప్రజలు మళ్ళీ ఒక్కటై నినదించారు. అసెంబ్లీవైపు వెళ్ళేందుకు ఒక్కొక్క అడుగు ముందుకు వేశారు. అంతే..ఇక ఆలస్యం లేకుండా హెచ్చరికలు లేకుండానే... ముందస్తు వ్యూహాన్ని అమలు చేస్తూ పోలీసులు నేరుగా కాల్పులు ప్రారంభించారు. బుల్లెట్ల వర్షంతో మారణహౌమం సృషించారు. ఈ దాడిలో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్థన్‌రెడ్డి తుపాకీ గుళ్ళకు బలయ్యారు. వీరులై నేలకొరిగారు. అంతేకాదు... దాదాపు వందలాదిమంది తూటాల వర్షంలో గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రశాంతమైన ఈ ప్రజాపోరు... పాలకుల తీరుతో యుద్ధరంగమై చరిత్రలో నిలిచింది.
రెండు దశాబ్ధాల క్రితం ప్రజా వ్యతిరేక విధానాలపై జనం చేసిన తిరుగుబాటుకు నిదర్శనమిది. ఆనాటి నియంతలు కావొచ్చు, నాటి నిజాం, రజాకార్లు కావొచ్చు, నిన్నటి ప్రజాకంటక పాలకులు కావచ్చు..! ఎవరైనా జన చైతన్యానికి తలవంచక తప్పదని నిరూపించిన పోరాటమిది. ఈ ఘటన ప్రభావంతోనే... తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ చిత్తుగా ఓడి అధికారానికి దూరమైంది. అంతే కాదు రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాకు ప్రయోగశాలగా మార్చాలని భావించిన బాబుకు భంగపాటు రుచి చూపింది. అన్ని రంగాల్ని విచ్ఛిన్నం చేసి అందిన కాడికి దోచుకోవాలనుకునే పెట్టుబడిదారి వర్గం కలల్ని చెదరగొట్టి, వారికో హెచ్చరిక చేసింది.
ఆ ఉద్యమ ప్రభావమే... నేటికీ అనేక రంగాల్లో పూర్తి స్థాయి ప్రయివేటీకరణ జరగకుండా అడ్డుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్ సంస్థను ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలుగా విభజించినా... వాటిలో పూర్తి స్థాయిలో ప్రపంచ బ్యాంకు విధానాలు అమలు చేయలేని స్థితి ఉందనీ, ఆర్టీసీ, ఆశావర్కర్లు , అంగన్వాడీలు, వాటర్‌బోర్డు, జీహెచ్ఎంసీ వంటి రంగాల్లో సరళీకరణను అడ్డుకోగలిగిందనీ, వారి ఉద్యోగాలూ నిలిచాయానీ, ఆ పోరాటమే నేటి అనేక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందనీ భావిస్తున్నారు. ఇది కాదనలేని వాస్తవం. విద్యుత్ పోరాటం తమ జీవితగమనాన్ని, గమ్యాన్ని పూర్తిగా మార్చేసిందంటున్నారు .నాడు తూటా తగిలి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఉద్యమకారులు. ఆ పోరాట ప్రభావమే తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ సర్కారు.... వేలాది మందిని ఉద్యోగాల్లోంచి ఊడబీకే ఉద్దేశంతో తెచ్చిన జీవో నెం. 5ను వెనక్కి కొట్టేలా చేసిందని అభిప్రాయపడుతున్నారు ఉద్యోగ కార్మికులు. ఈ సరళీకరణల చీకటి కాలంలో ఈ విద్యుత్ పోరాటం ఓ వెలుగుల దివిటీ. నేటి సంక్లిష్ట సమయంలోనూ భావితరాలకు బషీర్‌బాగ్ ఓ వెలుగుబాట...
అందుకే..
''బషీర్‌బాగ్‌లో...రాలిన ఒక్కో నెత్తుటి చుక్క దిక్కు దిక్కున చల్లిన విత్తులై... పోరాటాల పూలు పూయాలి.
ఉద్యమాల కాయలు కాయాలి. కష్టజీవు కలలు పండాలి''. అప్పుడే... అమరులకు అసలైన నివాళి.
- అనంగారి భాస్కర్ ,9010502255