Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు సంపత్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా 18 నెలల కరువు భత్యం (డీఏ) బకాయిలను నిరాకరించడాన్ని ఒప్పుకోబోమని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు చిలగాని సంపత్కుమారస్వామి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లకు రావాల్సిన ఐదు డీఏల్లో మూడింటిని ఇస్తూ జీవో నెంబర్ మూడు, నాలుగు విడుదల చేయడం సంతోషమేనని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే వాటిని చూస్తే ఆ సంతోషం లేదని పేర్కొన్నారు. 2020, జనవరి ఒకటి నుంచి 2021, జూన్ వరకు 18 నెలల బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. ఇప్పటికే ఆలస్యంగా 11వ పీఆర్సీ ఇవ్వడం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు 20 నెలల బకాయిలు నష్టపోయారని తెలిపారు. వారి ఆర్థిక ప్రయోజనాల్లో కోత పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. 18 నెలల డీఏ బకాయిలు నిరాకరించడంపై టీఎన్జీవో, టీజీవో వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. స్థానికతను కొల్లగొడుతున్న జీవో నెంబర్ 317ను రద్దు చేయాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఐక్యపోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.