Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఆర్డీ క్యాలెండర్ ఆవిష్కరణలో జి రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల సంక్షేమం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక కన్వీనర్ జి రాములు విమర్శించారు.హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ఎన్పీఆర్డీ ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య, సహాయ కార్యదర్శి బాలేశ్వర్, సభ్యురాలు పి శశికళ లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగుల సంక్షేమం కోసం ఉన్న అనేక చట్టాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వికలాంగులకు దివ్యాంగులుగా నామకరణం చేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకున్నదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా సమాజంలో అసమానతలు పెరిగిపోతున్నాయనీ, వాటిని నిర్మూలించేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. నామినేటెడ్ పోస్టుల్లో వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.