Authorization
Tue April 08, 2025 01:26:31 pm
- సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం: పీపీ ప్రాజెక్టులపై సమీక్షలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వానికి కట్టాల్సిన లీజులు, రెవెన్యూ షేర్ (ఏడీపీ) ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. లీజు అగ్రిమెంట్ నియమ నిబంధనల ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. డబ్బులు కట్టడానికి సహేతు కారణాల్లేని లీజు ఎగవేతదారుల సంస్థలకు వెంటనే చట్ట ప్రకారం చర్యలతో పాటు వివిధ ప్రభుత్వ సర్వీసుల శాఖలైన విద్యుత్ పంపిణీ సంస్థలు, తాగునీటి సరఫరా చేసే సంస్థలకు లేఖలు రాయాలని ఆదేశించారు. ఏయే సంస్థల నుంచి ఎంత డబ్బు ప్రభుత్వానికి బాకీ ఉందనే విషయంపై మంత్రికి టూరిజం అధికారులు వివరించారు. తెలంగాణ పర్యాటక శాఖలోని ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం(పీపీపీ)లో నిర్వహిస్తున్న ప్రాజెక్టులపై గురువారం తన కార్యాలయంలో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత విలువైన, వ్యూహాత్మక ప్రభుత్వ భూములను పర్యాటక సౌకర్యాలను కల్పించి ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో(పీపీపీ) పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి వివిధ సంస్థలకు కేటాయించడం జరిగిందన్నారు. అందులో భాగంగా హైదారాబాద్ నగరంలో ఐ-మాక్స్ థియేటర్(నెక్లెస్ రోడ్), ఎక్స్ పోటెల్ హోటల్ (లోయర్ ట్యాంక్‌బండ్), ట్రైడెంట్ హోటల్ (మాదాపూర్), దసపల్లా హోటల్ (జూబ్లీహిల్స్), జలవిహార్ (నెక్లెస్‌రోడ్), షామీర్‌పేట్‌లోని గోల్ఫ్ కోర్స్‌లను ప్రభుత్వ భూముల్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ సంస్థల బకాయిలు వెంటనే వసూలు చేయాలని, అందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పై అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు లీజు యజమానులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో టూరిజం ఎండీ మనోహర్, టూరిజం శాఖ జాయింట్ సెక్రటరీ కరోల్రమేష్, శంకర్‌రెడ్డి, లీగల్ అధికారులు, ఓఎస్డీ సత్యనారాయణ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.