Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసారైనా తెలంగాణకు న్యాయం చేయండి
- కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు బోయినపల్లి వినోద్‌కుమార్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కొత్త రైల్వేలైన్ల మంజూరులో తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. ఈసారి బడ్జెట్లోనైనా తమ రాష్ట్రానికి రైల్వే కొత్త లైన్లను మంజూరు చేసే విషయంలో న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఆయన గురువారం లేఖ రాశారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జీవనోపాధి కోసం తెలంగాణకు వలస వస్తున్నారనీ, దీంతో రైల్వే రవాణాకు ప్రాధాన్యత చేకూరుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లుండటం, విద్యుత్ కొరత లేకపోవడం, రైతు బంధు, రైతు బీమా పకడ్బందీగా అమలు చేస్తుండటం వల్ల స్వరాష్ట్రానికి ప్రజలు తిరిగొస్తున్నారని వివరించారు. అయినప్పటికీ, రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేవలం కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్ మాత్రమే కేంద్రం నుంచి మంజూరైందని తెలిపారు. అదీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమిని సమకూర్చి మూడో వంతు నిర్మాణ ఖర్చును భరించినందుకే మంజూరు చేశారని గుర్తు చేశారు.