Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరీంనగర్ లో చనిపోయిన ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోండి: సీఎం కేసీఆర్కు
ఎంఏఎస్ఎంసి చైర్మెన్ లేఖ
- 'నవ తెలంగాణ' కథనానికి స్పందన
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ముద్ర కోపరేటివ్ సొసైటీ కోసం ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఆదుకోవాలని ఆ సంస్థ చైర్మెన్ తిప్పినేని రామదాసప్పనాయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ రెన్నెళ్ళ కిందట బోర్డు తిప్పేసిన వైనంపై 'నవ తెలంగాణ' రాసిన కథనంపై ఆ సంస్థ చైర్మెన్ గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. సంస్థ బాగా నడిచినప్పుడు విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులకు, సిబ్బందికి ఏదైనా ప్రమాదం జరిగితే సకాలంలో ఆదుకున్నామని తెలిపారు. ఇప్పుడు హైదరాబాదులోని తమ రెండు కార్యాలయాలను సీజ్ చేయడమే కాకుండా ఖాతాలను నిలిపివేయడం వల్ల కార్యకలాపాలు నిర్వహించడం కష్టతరంగా మారిందన్నారు. తమ సంస్థను గట్టెక్కిస్తామని నమ్మబలికి ఎంతో మంది టీఆర్ఎస్ నేతలు మావద్ద డబ్బులు తీసుకున్నారని పేర్కొన్నారు. పోలీసులు సైతం తమను మోసం చేశారని తెలిపారు. వీరి నిర్వాకం వల్ల సంస్థలోని రెండు వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ముద్ర సొసైటీ ఆదుకునేందుకు ప్రభుత్వం ఒక కమిటీ వేసి విచారణ చేయాలని చైర్మెన్ కోరారు. మూడు రోజుల్లో ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేయాలని, లేనిపక్షంలో ఈ నెల 24న అత్యవసర విచారణ కోటాలో ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయనున్నామని చైర్మన్ పేర్కొన్నారు.